- డెడ్ స్టోరేజ్ కు చేరిన నాగార్జునసాగర్..
- సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం..
- ఆరుతడి పంటల వైపే ఏకైక మార్గం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లలో సాగర్ ఎడమ, కుడి కాలువల ఆయకట్టు పరిధిలోని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై భారీ వర్షాలు కురిసే సంకేతాలు లేకపోవడంతో, సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్-నినో పరిస్థితులు, ఆరుతడి పంటల ప్రోత్సాహంపై వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రుల కీలక సూచనలు & ఆదేశాలు:
వరి సాగు నిలిపివేత: చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు లేనందున ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాల్సి వస్తోంది. వరి నాట్లు వేసి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని హెచ్చరించారు.
ప్రత్యామ్నాయ పంటలు: కమాండ్ ఏరియాలోని రైతులు వెంటనే విత్తనాలు లభించే ప్రత్యామ్నాయ ఆరుతడి (ఆల్టర్నేటివ్) పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
ఐఏబీ (IAB) సమావేశాలు: జిల్లాల వ్యాప్తంగా తక్షణమే నీటిపారుదల సలహా సంఘం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాజెక్టుల్లోని నిజమైన నీటి లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రభుత్వ మద్దతు: ఆరుతడి పంటలకు కావలసిన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ఆరుతడి పంటలపై ఏఈఓలు వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.