- 874.80 అడుగులకు జలమట్టం.. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
- శ్రీశైలానికి కొనసాగుతున్న 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
- నాగార్జునసాగర్‌లో 513.80 అడుగులకు చేరిన నీటిమట్టం
శ్రీశైలం/నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: కృష్ణా నదీ పరివాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి లభించిన సమాచారం ప్రకారం జలాశయానికి 2,12,365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇందులో జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి 30,599 క్యూసెక్కులు, జూరాల స్పిల్‌వే ద్వారా 1,81,766 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది.
వరద పెరుగుతుండటంతో అధికారులు జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 30,792 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా నీటిమట్టం వివరాలు:
ప్రస్తుత నీటిమట్టం: 874.80 అడుగులు / 266.650 మీటర్లు (పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు)
ప్రస్తుత నీటి నిల్వ: 162.8190 టీఎంసీలు (మొత్తం నిల్వ సామర్థ్యం: 215.8070 టీఎంసీలు)
విద్యుత్ ఉత్పత్తి నీటి వినియోగం: కుడి గట్టు కేంద్రం ద్వారా 9,603 క్యూసెక్కులు, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 21,189 క్యూసెక్కులు.
స్పిల్‌వే స్థితి: ప్రస్తుతం స్పిల్‌వే గేట్లను తెరవలేదు.
నాగార్జునసాగర్‌లో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం
మరొకవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా పెరిగి 513.80 అడుగులకు (138.2126 టీఎంసీలు) చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎఎంఆర్పీ (SLBC) ద్వారా అంతే మొత్తంలో 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రం, క్రెస్ట్ గేట్లు మరియు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల నిలిపివేశారు.