చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు/మునుగోడు, ఏపీబీ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నేతన్నల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుగా స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నేతన్నలందరికీ రాజగోపాల్ రెడ్డి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

చేనేత రంగ రక్షణ: వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వైఎస్సార్తో రుణమాఫీ: 2009లో గట్టుప్పల్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించిపోయానని, నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి చేనేత సొసైటీలకు రుణమాఫీ చేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రభుత్వ దృష్టికి డిమాండ్లు: 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు, రుణాలు, అర్హులందరికీ జియో ట్యాగింగ్, ఆప్కో (TSCO) ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

మంత్రితో కలిసి సీఎం వద్దకు: చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వెంటబెట్టుకుని నేతన్నల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తానని తెలిపారు.

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి: “కొండా లక్ష్మణ్ బాపూజీ నా అభిమాన నేత. గతంలో చిన్న కొండూరు (ప్రస్తుత మునుగోడు) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహించడం నా పూర్వజన్మ సుకృతం. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఆయన మమ్మల్ని పిలిపించి దిశానిర్దేశం చేసేవారు” అని స్మరించుకున్నారు.

గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించి ప్రాణం పోసిందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసి వెళ్లిన అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ సమర్థవంతంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

Share
Share