- టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతల అనంతరం ఢిల్లీలో ప్రెస్ మీట్..
- బిఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలో తిప్పికొడతామని స్పష్టం
న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ స్టేట్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం బిఆర్ఎస్, బీజేపీల తీరుపై ఎంపీ చామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ చిన్న తప్పు మాట్లాడతారా అని ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి శునకానందం పొందడమే కేటీఆర్, హరీష్ రావుల ప్రధాన లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్:
బావా-బామ్మర్దులపై విమర్శలు: కృష్ణా, గోదావరి నీళ్ల పేరుతో మరోసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌ను తెరపైకి తేలాలని కేటీఆర్, హరీష్ రావు యత్నిస్తున్నారని, వారిద్దరూ దౌర్భాగ్యులని ధ్వజమెత్తారు.
నీటి హక్కుల సాధన: గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల కృషి ఉందన్నారు.
సోషల్ మీడియాకే పరిమితం: వరుసగా ఐదు ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్కు బుద్ధి చెప్పినా తీరు మారలేదని, బిఆర్ఎస్ ప్రస్తుతం కేవలం సోషల్ మీడియాకే పరిమితమై విషబీజాలు నాటుతోందని విమర్శించారు.
విద్యా వ్యవస్థ బాగు: రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏనాడూ వ్యతిరేకం కాదని, గత బిఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలతో నాశనమైన విద్యా వ్యవస్థను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతోందని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైన బిఆర్ఎస్ నేతలు, నిజాం నవాబులా పదేళ్లు పాలించిన కేసీఆర్ వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. బిఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొడతాయని ఎంపీ చామల స్పష్టం చేశారు.