- 78.30% ఎన్యూమరేషన్ పూర్తి..
- తుది జాబితా అక్టోబర్ 19న!
- మరణించిన వారు 9.22 లక్షలు..
- 6.70 లక్షల డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు..
- నేటి నుంచే అభ్యంతరాల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం (EC) అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Rolls) విడుదల చేశారు.
తెలంగాణ ఓటర్ లిస్ట్‌లో పేరు చెక్ చేసే విధానం:
- కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
- మీ జిల్లాను ఎంచుకోండి.
- మీ నియోజకవర్గంను ఎంచుకోండి.
- మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి.
- అనంతరం మీ పార్ట్ నంబర్ల వారీగా, బూత్‌ల వారీగా డేటా కనిపిస్తుంది.
- సంబంధిత PDF ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- డౌన్లోడ్ చేసిన PDFలో మీ పేరు కోసం వెతకండి.
- మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోండి.
గమనిక: PDFలో మీ పేరు మాత్రమే కాకుండా, మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలించండి.
Link: https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29
ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నివేదిక – కీలక గణాంకాలు:
ఎన్యూమరేషన్ సేకరణ: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లలో 78.30% మందికి సంబంధించి 2,64,87,213 ఎన్యూమరేషన్ ఫారాలను విజయవంతంగా సేకరించారు.
మృతి చెందిన ఓటర్లు: పరిశీలనలో 9,22,229 మంది ఓటర్లు (2.73%) మరణించినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తరలివెళ్లిన / అందుబాటులో లేనివారు: మొత్తం 57,46,803 మంది ఓటర్లు (16.99%) శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్లు, అందుబాటులో లేనట్లు లేదా ఇతర కేటగిరీల కింద ఉన్నట్లు గుర్తించారు.
డూప్లికేట్ ఓటర్లు: 6,70,203 మంది ఓటర్లు (1.98%) ఒక ప్రాంతం కంటే ఎక్కువ చోట్ల తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఎస్ఐఆర్ సర్వేలో తేలింది.
అభ్యంతరాలు, చేర్పులకు అవకాశం:
అర్హులైన నిజమైన ఓటర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు గడువు పొడిగించారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలో భాగంగా బాధితులు ఫారం-6 (Form-6) తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చని ఈసీ సూచించింది. అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదైన వారికి సంబంధించి.. ఏదైనా ఒకే ప్రదేశంలో మాత్రమే వారి ఓటు హక్కును కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అభ్యంతరాలు మరియు విచారణల అనంతరం అక్టోబర్ 19, 2026న తుది ఓటర్ల జాబితాను (Final Electoral Roll) విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.