- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో..
- పెరిగిన నీటి నిల్వ, వేగంగా పెరుగుతున్న జలమట్టం
శ్రీశైలం, ఏపీబీ న్యూస్: కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి లభించిన అధికారిక సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,16,764 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
జూరాల ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం ద్వారా 28,156 క్యూసెక్కులు, జూరాల స్పిల్వే ద్వారా 1,88,608 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు వదులుతున్నారు. సుంకేసుల, హంద్రీ నది మరియు స్థానిక క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ప్రవాహాలు సాధారణంగానే నమోదు అవుతున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా నీటిమట్టం & వివరాలు:
ప్రస్తుత నీటిమట్టం: 871.70 అడుగులు / 265.700 మీటర్లు (పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు)
ప్రస్తుత నీటి నిల్వ: 149.0620 టీఎంసీలు (మొత్తం నిల్వ సామర్థ్యం: 215.8070 టీఎంసీలు)
వరద ప్రవాహం (Inflow): 2,16,764 క్యూసెక్కులు (తక్షణ వరద ప్రవాహం: 2,25,901 క్యూసెక్కులు)
పవర్ హౌస్/స్పిల్ వే వివరాలు:
ప్రస్తుతం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. స్పిల్వే గేట్లు ఎత్తలేదు మరియు పీహెచ్–2 పంప్ మోడ్ కూడా నిర్వహించలేదు.
ఎగువ నుంచి స్థిరంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. త్వరలోనే ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని, వరద ఉధృతి ఇలాగే ఉంటే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.