APB News Exclusive: బీఆర్ఎస్ అగ్రనేతల పైన.. నల్లగొండ జిల్లా విప్​ల ఎదురుదాడి..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ ‘విప్’ ల స్వరం ఘాటెక్కింది. బీఆర్ఎస్(BRS) అగ్రనేతలే లక్ష్యంగా మాటల తూటలను పేలుస్తున్నారు. ప్రభుత్వానికి విప్ లే చెవులు, కళ్లు అని సీఎం రేవంత్ హితబోధ చేసిన నేపథ్యంలో ఇద్దరు విప్ లు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. జిల్లా నుంచి ఇద్దరు అగ్రనేతలు ప్రభుత్వం లో కీరోల్ పోషిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ నాయకత్వాన్ని బలపర్చడంలో నకిరేకల్, ఆలేరు ఎమ్మెల్యేలు వేములు వీరేశం, బీర్ల అయిలయ్యలు పోటీపడుతున్నారు. రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులతో పాటు, బీర్ల అయిలయ్యకు విప్ హోదా దక్కింది. అయిలయ్య అడగకపోయినా, తానే విప్ హోదా ఇచ్చానని సీఎం రేవంత్ అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆయన మాత్రం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు అనుగుణంగా మొదట్లో ఆచితూచి వ్యవహారించారు. అటు యాదాద్రి జిల్లాలో, ఇటు ప్రభుత్వంలో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అయిలయ్యకు చాలా సమయం పట్టింది. విప్ తో పాటు అధనంగా బీసీ గొల్ల కుర్ముల కోటాలో యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వరించింది. అయినప్పటికీ కాంట్రవర్సీకి పోకుండా మొదటి రెండేళ్లు ఆలేరు సమస్యల పైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల సీఎం క్లాస్ పీకడంతో ఇద్దరు విప్ లు ప్రత్యర్థుల పైన నిప్పులు చెరగడం మొదలు పెట్టారు.

రెండో విడతలో ఎస్సీ మాదిగ కోటాలో విప్ హోదా పొందిన వీరేశం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీ వెలుపల, బయట వీరేశం విప్ హోదాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీరేశం తన రాజకీయ వ్యూహాన్నే పూర్తిగా చేంజ్ చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడి, రెండు సార్లు గెలిచిన అనుభవాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. సీఎం రేవంత్ సపోర్ట్, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉండటం వీరేశానికి మరింత కలిసొచ్చింది. బీఆర్ఎస్ రాజకీయాలను వంటపట్టించుకున్న వీరేశానికి విప్ హోదా బలమైన అస్త్రంగా మారింది. బీఆర్ఎస్లో హారీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి అనుచురుడిగా గుర్తింపు పొందిన వీరేశం.. జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ చివరకు అధిష్టానం పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించింది. బీఆర్ఎస్ రాజకీయాలను వంటపట్టించుకున్న వీరేశం కాంగ్రెస్ కు పదునైనా ఆ యుధంగా మారారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ని వ్యతిరేకించే శక్తులను ఎండగట్టడంలో వీరేశం ముందువరసలో ఉన్నారు. జిల్లా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖాపరమైన విమర్శలకే పరిమితం కాగా, నల్లగొండ మంత్రి వెంకటరెడ్డి రేవంత్ కు అండగా ప్రత్యర్థుల పైన కఠువుగానే వ్యవహారిస్తున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం బీఆర్ఎస్, బీజేపీ చర్యలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేధికగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వీరేశం తోడై బీఆర్ఎస్ శ్రేణులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

పీపుల్స్ వార్ నేపథ్యం కలిగిన వీరేశం రాజకీయాల్లో సైతం ముక్కుసూటి మనిషి అనే పేరు ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అసెంబ్లీ సాక్షి గానే ‘నన్ను కెలకొద్దు’ అని బీఆర్ఎస్ శ్రేణులకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. నకిరేకల్లో సైతం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిని నువ్వు ఎక్కడైన తిరుగు, ఏదైనా చేసుకో.. నా జోలికి ఎందుకు? అని సుతిమెత్తిని హెచ్చరికలు చేశారు. పైకి సున్నితంగా కనిపించే వీరేశానికి ఇప్పుడు ప్రభుత్వం తరపున ప్రత్యర్థులను నిలదీసే అధికారం విప్ రూపంలో కలిసొచ్చింది. దాంతో మాజీ సీఎం కేసీఆర్ మొదలు, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు చేసిన కుట్రల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, పార్టీ పైన బీఆర్ఎస్ అగ్రనేతల చేస్తున్న విమర్శలను సీఎల్పీ మీడియా పాయింట్ వేధికగా హైదరాబాద్ నుంచే గట్టి కౌంటర్లు ఇవ్వడం షురూ చేశారు. అయితే వీరేశానికి కౌంటర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు అంతగా స్పందించడం లేదు. కానీ అయిలయ్య చర్యలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మహేందర్ రెడ్డిలు నిరసన కార్యక్రమాలు చేయడం గమనార్హం.

Share
Share