- సూపర్ ఎల్ నినో భయాలు..
- ఆగస్టు 15 నాటికి ఆరుతడి వైపు మళ్లాలని, 1.5 లక్షల ఎకరాల లక్ష్యంతో అవగాహన కల్పించాలని
- నల్గొండ ఐఏబీ సమావేశంలో ఆదేశం!
నల్గొండ, ఏపీబీ న్యూస్: తీవ్రమైన ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నాయని, ప్రస్తుతం ఉన్న నీరు కేవలం జూన్ 2027 వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కష్ట కాలంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి నాట్లు వేయకుండా, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి (IAB) సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:
సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదు: శ్రీశైలం నుంచి కొద్దిగా నీరు వచ్చినప్పటికీ పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఎఎంఆర్పీ Reservoir కూడా సగమే నిండిందని తెలిపారు.
సూపర్ ఎల్ నినో ముప్పు: రాబోయే రోజుల్లో ‘సూపర్ ఎల్ నినో’ వల్ల దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షన్నర ఎకరాల్లో ఆరుతడి: జిల్లాలో ఇప్పటివరకు 33 వేల ఎకరాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేశారని, దాన్ని 1,50,000 ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో పంట మార్పిడి చేయించాలని ఆదేశించారు.
ఎస్ఎల్బీసీ పనుల హామీ: శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
రైతులకు రాయితీలు: నిరంతరం వరి వేయడం వల్ల భూములు నిస్సారమవుతాయని, ఆర్గానిక్ వ్యవసాయం, కూరగాయలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని కోరారు. అధికారులు కోరిన 5 వేల స్ప్రింక్లర్ యూనిట్లను తక్షణమే మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఆగస్టు 15లోగా చైతన్యం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సెప్టెంబర్ వరకు ఎల్ నినో ప్రభావం ఉంటుందని, ఉత్తర తెలంగాణకు మాత్రమే అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరుతడి పంటలు వేసుకోవడానికి ఆగస్టు 15 వరకే సమయం ఉన్నందున వ్యవసాయ అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీల్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నీటిపారుదల సీఈ శ్రీనివాస్ రెడ్డి, వివిధ మార్కెట్ కమిటీల చైర్మన్లు, పాక్స్ అధ్యక్షులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.