APB News Exclusive: గ్రాడ్యుయేట్ బరిలో గుత్తా అమిత్?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ కానున్న ఈ స్థానానికి గుత్తా అమిత్ రెడ్డిని బరిలో దింపే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న గుత్తా అమిత్ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో ఆయనకు మళ్లీ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలా, లేక ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత చురుకుగా తేవాలన్న దానిపై కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అమిత్కు బలమైన వేదిక కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా వచ్చే ఏడాదితో ముగియనుంది. ఆయన భవిష్యత్తు రాజకీయ అడుగులు, అమిత్ రాజకీయ ప్రస్థానం ఈ రెండు అంశాలను కలిపి కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తోందన్న చర్చ నల్లగొండ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో పీసీసీ కమిటీల పునర్వ్యవస్థీకరణలో అమిత్కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియా విభాగంలో ఆయనకు ప్రాధాన్యం కల్పించాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది.

మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ స్థానంపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు, రాణి రుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు వెలువడకపోయినా మూడు ప్రధాన పార్టీలూ బలమైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబరులో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. ఆ తర్వాత నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలూ ఇప్పటినుంచే పకడ్బందీ వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి.

ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ పోటీలా కనిపించడం లేదు. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న తీరు చూస్తే హెవీవెయిట్ ఫైట్ కు రంగం సిద్ధమవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నల్లగొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం విస్తరించి ఉండటం ఈ ఎన్నికను రాజకీయంగా అత్యంత కీలకంగా మారుస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించిన గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకోవడం అంత సులభం కాదని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఇప్పటినుంచే బలమైన అభ్యర్థులను ఖరారు చేసి, వారి ఆధ్వర్యంలోనే ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నాయి.

ఈ ఎన్నికలో అత్యంత కీలక అంశం ఓటరు నమోదు ప్రక్రియ. కొత్త నమోదు కార్యక్రమం ప్రారంభమైన వెంటనే పాత జాబితా పూర్తిగా రద్దవుతుంది. అంటే ప్రతి పార్టీ మళ్లీ మొదటి నుంచి ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అయితే ఓటరు నమోదు యంత్రాంగం కూడా ఆలస్యమవుతుందనే ఆందోళన పార్టీల్లో వ్యక్తమవుతోంది.

గత ఎన్నికల అనుభవాలు కూడా పార్టీలను అప్రమత్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరామ్ పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలే ఓటరు నమోదు కేంద్రాలుగా మారాయి. ఆ తర్వాత పల్లా రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో చింతపండు నవీన్, రాకేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, ఆయన కొత్త పార్టీ స్థాపించిన నేపథ్యంలో మళ్లీ పోటీ చేస్తారా? లేక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఖర్చుల విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవని నాయకులే చెబుతున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.40 కోట్ల వరకు వ్యయం చేశారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్థులనే బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Share
Share