APB News Exclusive: మంత్రుల జిల్లాలో లారీలు మాయం.. మిల్లర్ల గేమ్‌..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లు రవాణా చేయాల్సిన లారీల జాడ కనిపించట్లేదు. ఈ సీజన్ లో సెంటర్ల నుంచి మిల్లులకు వడ్లు రవాణా చేసేందుకు 800 లారీలు కేటాయించినట్టు సివిల్ సప్లై చెప్తోంది. కానీ ఫీల్డ్లో మాత్రం 337 లారీలే తిరుగుతున్నాయి. మరీ మిగతా 463 లారీలు ఎక్కడున్నాయో.. అసల ఉన్నాయో లేదో కూడా ఎవరికి అంతుచిక్కడం లేదు. 337 లారీల్లో 184 లారీలు దిగుమతిగాక మిల్లుల వద్దే రోజుల తరబడి ఆగిపోయాయి. మరో 153 లారీలు అన్లోడింగ్ చేసి తిరిగి సెంటర్లకు చేరుకుంటున్నాయి. ఈ లెక్కన రోజుకు 337 లారీల తోనే వడ్ల రవాణా జరుగుతోంది. దీంతో వడ్ల కొనుగోళ్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. లారీల జాడ కనిపించక పోవడంతో రోజుకు సగటున 16,155 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే లోడింగ్ అవుతున్నాయి. మొత్తం 458 సెంటర్ల నుంచి సగటున రోజుకు 35 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లులకు రవాణా చేయాల్సి ఉంది, కానీ లారీలు ఎక్కడున్నాయో అధికారులకు అంతుచిక్కకపోవడంతో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వడ్ల కొనుగోలు పూర్తియ్యాయి. ఇంకా 50 శాతం వడ్లు కేంద్రాల వద్దే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఆరు నియోజకవర్గాల్లోని 458 సెంటర్ల వద్ద ఇప్పటి వరకు 6,37,798 మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చాయి. దీంట్లో కేవలం 3,18,971 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లులకు చేరాయి. ఇంకా 3,18,827 మెట్రిక్ టన్నుల వడ్లు కేంద్రాల వద్దే పేరుకుపోయాయి.

కాంట్రాక్టు అగ్రిమెంట్ ప్రకారం లారీల నంబర్లుతో సహా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్లో లారీలకు బదులు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. టెండర్లలో చూపించిన లారీల జాడ ఏమైందో తెలియడం లేదు. దేవరకొండ నియోజకవర్గానికి 25 లారీలు, మిర్యాలగూడకు 75, మునుగోడుకు 45, నాగార్జునసాగర్ కు 130, నకిరేకల్ కు 243, నల్లగొండకు 252, శాలిగౌరారం మండలానికి 30 లారీలు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా లారీల కేటాయింపులో కూడా అవతవకలు చోటు చేసుకున్నాయి. వడ్ల దిగుబడి ఎక్కవ వచ్చే మండలాలను పక్కన పెట్టి, సొంత ప్రయోజనాలకే అధికారులు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలను సైతం మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల మాట అసలే వినిపించుకోవడం లేదు. కోమటిరెడ్డి నల్లగొండలో మీటింగ్ పెట్టినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక ఉత్తమ్ ఆదేశాల మేరకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించినప్పటికీ కొనుగోళ్ల వ్యవహారం ఆందోళనకరంగానే మారింది. తాలు సమస్యను సాకుచూపడంతో 47 కేజీల బస్తాలో ఒక కేజీ తక్కువ తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నా మిల్లర్లు మాత్రం మెట్టుదిగి రావట్లేదు. బస్తాకు ఒక కేజీ చొప్పున మిల్లులకు లాభం చేకూరేలా రైతులను ఒప్పించి అధికారులే ఢీల్ కుదిర్చారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువ కావాలని తాలు ఎక్కువ వస్తోందని, లేనిపోని కొర్రీలు పెడుతున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు బస్తాకు ఒక్క రూపాయి కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. కమీషన్ ఇచ్చిన సెంటర్లకే లారీలు వెళుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఖాళీ ట్రక్ షీట్లు మిల్లులకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లాక రైతులను బెదిరించి తూకంలో కోతలు పెడుతున్నారు. భాహాటంగానే ఇదంతా జరుగుతున్నా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లు, బస్తాకు రెండు, మూడు కిలోలు తక్కువ తూకం వేయాలని మిల్లర్ల డిమాండ్తో జిల్లాలో వడ్ల మాఫియా అదుపుతప్పి నడుస్తోంది.

సెంటర్ల నిర్వహకులు, రవాణా కాంట్రాక్టర్లు, మిల్లర్లు ఎవరికి వారే అందిన కాడికి దండుకునే పనిలో పడ్డారు. బస్తాకు రూపాయి కమీషన్ ఇస్తేనే లారీలు పంపిస్తాం అని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. మరో గత్యంతరం లేక కమీషన్ ఇచ్చేందుకు రైతులను బతిమిలాడి ఒప్పిస్తున్నారు. అసలు కమీషన్ ఎందుకు ఇవ్వాలి? అని నిలదీస్తే రెండు వర్గాల మద్య పంచాయతీ షురూ.. మీకు ఎందుకు కమీషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తే.. మీరు ఇస్తున్నరు కాబట్టే మేం అడుగుతున్నాం అని కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారు. సెంటర్ కు రోజుకు రెండు లారీలు వెళ్లాలని రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. కానీ మిల్లర్లు దింపుకోవడం లేదనే సాకుతో ఇద్దరు కుమ్మకై సెంటర్ల పైన ఎటాక్ చేస్తున్నారు. తాలు ఎక్కువ ఉందని, ట్రక్ షీట్లు మార్చాలని అన్లోడింగ్ చేయడం లేదు. నిత్యం ఏదో ఒక కొత్త సమస్యను సృష్టించి చివరికి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

కొండమల్లేపల్లి, పీఏపల్లి, నేరేడుగొమ్ము, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, మునుగోడు, చండూరు, అనుమల, గుర్రంపోడు, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి, నకిరేకల్, నార్కట్ పల్లి, కనగల్, నల్లగొండ, తిప్పర్తి, శాలి గౌరారం మండలాల్లో పరిధిలోని ఐకేపీ(IKP), పీఏసీఎస్(PACS) సెంటర్లలో కొన్ని వేల మెట్రిక్ టన్నుల వడ్ల కుప్పులు రాశులుగా పోశారు.

Share
Share