SIR Draft: నల్లగొండ జిల్లాలో 13.57 లక్షల మంది ఓటర్లు.. సూర్యాపేటలో..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (SIR) ముసాయిదాను సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని డీఈఓ(DEO), ఈఆర్ఓ(ERO), ఏఈఆర్ఓ(AERO) కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు తదితర నిర్ణీత ప్రదేశాల్లో ముసాయిదా జాబితాలను అందుబాటులో ఉంచారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 13,57,618 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,73,058 మంది పురుషులు, 6,84,488 మంది మహిళలు, 72 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరితో పాటు 542 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో 2,46,722 మంది ఓటర్లతో అత్యధిక సంఖ్య నమోదైంది. ఆ తర్వాత నకిరేకల్లో 2,38,362, దేవరకొండలో 2,32,283, నల్గొండలో 2,17,681, నాగార్జునసాగర్లో 2,13,408, మిర్యాలగూడలో 2,09,162 మంది ఓటర్లు ఉన్నారు.

  • సూర్యాపేటలో 90.45 శాతం ఓటర్ల డిజిటలైజేషన్
  • ఎస్ఐఆర్-2026కు సర్వం సిద్ధం..
  • 9.11 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్
  • 96,307 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ కాలేదు..
  • తుంగతుర్తిలో అత్యధికం, కోదాడలో అత్యల్పం

సూర్యాపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు (ఎస్ఐఆర్-2026) అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత తేదీగా తీసుకుని ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో.. జిల్లాలోని ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 10,08,252 మంది ఓటర్లు ఉండగా.. 9,11,945 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేశారు. దీంతో మొత్తం ఓటర్లలో 90.45 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లాలో మొత్తం ఓటర్లలో 96,307 మంది (9.55 శాతం) వివరాలు డిజిటలైజ్ కాలేకపోయాయి. వీరిలో 26,059 మంది మరణించినవారు, 48,310 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే 13,016 మంది ఇమ్మిగ్రేషన్/ఇతర కారణాలతో, 6,862 మంది ద్విరావాసులు, 2,060 మంది ఇతర కారణాలకు సంబంధించి గుర్తించబడని వారు* ఉన్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రానున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో ఈ ఓటర్ల వివరాలపై మరింత పరిశీలన జరగనుంది.

నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ను పరిశీలిస్తే తుంగతుర్తి నియోజకవర్గం 91.88 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,63,741 మంది ఓటర్లు ఉండగా.. 2,42,333 మంది వివరాలను డిజిటలైజ్ చేశారు.

హుజూర్నగర్ నియోజకవర్గంలో 90.99 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. మొత్తం 2,49,904 మంది ఓటర్లకు గాను 2,27,398 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి.

సూర్యాపేట నియోజకవర్గంలో 89.41 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. ఇక్కడ 2,46,432 మంది ఓటర్లకు గాను 2,20,335 మంది వివరాలు డిజిటలైజ్ చేశారు.

కోదాడ నియోజకవర్గంలో 89.40 శాతంతో అత్యల్ప డిజిటలైజేషన్ నమోదైంది. మొత్తం 2,48,175 మంది ఓటర్లకు గాను 2,21,879 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో కొనసాగించడం, అనర్హులు, మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారి వివరాలను గుర్తించడం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటలైజ్ చేసిన వివరాలతో పాటు డిజిటలైజ్ కాని 96,307 మంది ఓటర్ల వివరాలపై అధికారులు చేపట్టే తదుపరి చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ముఖ్యంగా మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారి వివరాలను పరిశీలించి ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించే అవకాశం ఉంది.

సూర్యాపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 10,08,252 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. ఇందులో దాదాపు 9.12 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇప్పటికే డిజిటలైజ్ కావడంతో.. ఎస్ఐఆర్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం కీలక దశకు చేరుకుంది.

ఇక మిగిలిన 9.55 శాతం ఓటర్ల వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియే ఇప్పుడు అధికారులకు ప్రధాన సవాలుగా మారనుంది.

ముసాయిదా జాబితాలో పేర్లు లేని గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను సంబంధిత కార్యాలయాలు, గ్రామపంచాయతీ/మున్సిపల్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. ఈ వివరాలను సీఈఓ(CEO) తెలంగాణ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు.

ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, పేరును తొలగించేందుకు అభ్యంతరం/డిలీషన్కు ఫారం-7, చిరునామా మార్పు, వివరాల సవరణ తదితరాలకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్న ఏ పేరునూ నోటీసు ఇవ్వకుండా, విచారణ నిర్వహించకుండా తొలగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం కల్పించిన తర్వాతే ఈఆర్ఓ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయంపై అసంతృప్తి ఉంటే 15 రోజుల్లో జిల్లా మేజిస్ట్రేట్కు, ఆ తర్వాత 30 రోజుల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.

ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఓటరూ పరిశీలించుకోవాలని, పేరు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులుంటే నిర్ణీత గడువులో సవరణకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Share
Share