Breaking News: జూన్ 2027 వరకు తాగునీటికే ప్రాధాన్యం.. పంటలకు సాగునీరు బంద్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: వచ్చే నెలలో ‘సూపర్ ఎల్ నినో’ (Super El Nino) ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో ఉన్న నీటిని జూన్ 2027 వరకు కేవలం తాగునీటి అవసరాలు, పశువుల దాహార్తి తీర్చడం కోసం మాత్రమే నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ (CE) శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రాజెక్టుల కింద ఎలాంటి పంటలకు సాగునీరు విడుదల చేయడం జరగదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.

సూపర్ ఎల్ నినో ప్రభావం: రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున జూన్ 2027 వరకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

పంటలకు నీరు బంద్: జిల్లాలోని తక్కిన అన్ని ప్రాజెక్టుల నుంచి పంట కాలువలకు నీటిని వదిలే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు.

డిండి ప్రాజెక్టుకు మినహాయింపు: మిషన్ భగీరథ నీటి సరఫరా అందుబాటులో లేని కారణంగా, ఒక్క పాత డిండి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మాత్రం 12,875 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు CE శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టుల నీటిని నమ్ముకుని ఎవరైనా రైతులు ఇప్పటికే పంటలు వేసుకుని ఉంటే, ఆ పంటలను కాపాడుకోవడానికి సొంతంగా బోర్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రాజెక్టు నీటిపై ఆధారపడవద్దని అధికారులు తేల్చిచెప్పారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా జిల్లా ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

Share
Share