APB News Exclusive: నల్లగొండ ఐకాన్ ఆసుపత్రిలో.. మృత్యుఘోష

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో కార్పొరేట్ వైద్యసేవల పేరుతో నడుస్తున్న ఐకాన్ ప్రైవేటు ఆసుపత్రిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి రెండు కాదు.. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే 196 మంది రోగులు మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. లెక్కలు చూస్తే నెలకు సగటున 28 మంది చనిపోయినట్టవుతోంది. అంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నా ఇప్పటి వరకు విషయం బహిర్గతం కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారానికి రాజకీయ అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

నల్లగొండలో ఇటీవలి కాలంలో కార్పొరేట్ వైద్యసేవల పేరుతో ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. అయితే నిజంగా నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రి ఏది, కేవలం ప్రచారంతో నడిచేది ఏది అన్నది సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రుల మధ్య పోటీ తీవ్రరూపం దాల్చడంతో చివరకు పేషెంట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పేషెంట్లను తమ ఆసుపత్రులకు రప్పించేందుకు ఆర్ఎంపీ(RMP)లు, అంబులెన్స్ డ్రైవర్లకు భారీ మొత్తాల్లో కమీషన్లు ఆఫర్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐకాన్(ICON) ఆసుపత్రి పేషెంట్ను రిఫర్ చేసిన వారికి 40 నుంచి 50 శాతం వరకు కమీషన్ ఇస్తోందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, విందులు, వినోద యాత్రలు, విదేశీ టూర్లు, గోవా ట్రిప్పులు వంటి ప్రలోభాలతో బ్రోకర్ నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నారనే ఆరోపణలు మరింత తీవ్రతరం అయ్యాయి.

ఆసుపత్రి రికార్డుల్లో నమోదైన మరణాల విశ్లేషణలో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయినట్టు నమోదు చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం. అంత పెద్ద సంఖ్యలో గుండెజబ్బు మరణాలు నమోదవడం వెనుక వైద్యపరమైన కారణాలున్నాయా, లేక రికార్డు నిర్వహణలో లోపాలున్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అసలు ఐకాన్లో శాశ్వత స్పెషలిస్టు వైద్యులు లేరని డీఎంహెచ్ఓ విచారణలో తేలినట్టు సమాచారం. పేరుకు కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో వంటి విభాగాలు ఉన్నప్పటికీ, సేవలు ఎక్కువగా విజిటింగ్ డాక్టర్ల ద్వారానే నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వైద్యులు బయట నుంచి వచ్చి సర్జరీలు చేసి వెంటనే వెళ్లిపోతున్నారని, ఆ తర్వాత ఆపరేషన్ అయిన రోగుల పరిస్థితిని పర్యవేక్షించే వ్యవస్థ సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ లోపిస్తే ప్రాణాపాయం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

“గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్ వంటి క్లిష్ట వ్యాధులకు అత్యాధునిక వైద్యం” అంటూ భారీ ప్రచారం నిర్వహించడం, మీడియా ప్రకటనల ద్వారా ప్రజల్లో నమ్మకం కల్పించడం ఐకాన్ ఆసుపత్రి వ్యూహంగా మారిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆ ప్రచారానికి అనుగుణంగా వైద్య సదుపాయాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ఐకాన్ ఆసుపత్రిలో అనేక అక్రమాలు వెలుగుచూసినట్లు సమాచారం. తనిఖీ సమయంలో ఆసుపత్రిలో పలు విభాగాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్టు తెలిసింది. ఈ పరిణామం నల్లగొండ వైద్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తనిఖీ సందర్భంగా డీఎంహెచ్ఓ(DMHO) ఒక క్యాన్సర్ రోగితో మాట్లాడగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మొదట రూ.1 లక్ష ప్యాకేజీగా ఒప్పందం చేసుకుని, ఆసుపత్రిలో చేరిన తర్వాత అదనంగా మరో రూ.50 వేల వరకు వసూలు చేశారని ఆ రోగి తెలిపినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం క్యాన్సర్ చికిత్స అందించే ఆసుపత్రిలో అర్హత కలిగిన ఆంకాలజీ స్పెషలిస్టులు, సంబంధిత సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ అలాంటి నిపుణులు ఆసుపత్రిలో లేరనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తనిఖీలో పార్కింగ్ ప్రాంతంలోనే సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేసినట్టు, ఆసుపత్రి మౌలిక వసతులు అనేక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అత్యవసర సేవలు, సిబ్బంది లభ్యత వంటి అంశాలపై కూడా అధికారుల దృష్టి పడినట్టు సమాచారం.

DMHO Dr Rahul

ఆసుపత్రిలోనే మరణించిన వారి సంఖ్య 196గా నమోదైంది. అయితే చికిత్స అనంతరం ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసిన రోగుల్లో ఎంతమంది మృతి చెందారు అన్నదానిపై స్పష్టత లేదు. పూర్తి వైద్య రికార్డులు, రిఫరల్ వివరాలు, మరణ ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తే అసలు చిత్రమేంటో బయటపడే అవకాశముందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

తనిఖీ అనంతరం ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోందని సమాచారం. లైసెన్సు నిబంధనలు, వైద్య సిబ్బంది అర్హతలు, ఐసీయూ(ICU) ప్రమాణాలు, శస్త్రచికిత్సల అనుమతులు, క్యాన్సర్ చికిత్స అనుమతులపై సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆ చర్యలు నిజంగా అమలవుతాయా? లేక విచారణలతోనే వ్యవహారం ముగుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల అండతోనే ఆసుపత్రి యాజమాన్యం ప్రభావవంతంగా వ్యవహరిస్తోందని, వివాదాలు వచ్చినప్పుడల్లా మీడియా, పోలీసు వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఐకాన్ ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఎంత మంది చనిపోయారు? వాటికి గల కారణాలను విచారించేందుకు సమగ్ర ధర్యాప్తు చేయాలని డాక్టర్లు, పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐకాన్ ఆసుపత్రి బాగోతం బయట పడటంతో దాంట్లో చికిత్స పొందుతున్న రోగుల్లో ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు మాయ మాటలతో తమను మోసం చేశారని, దీని పైన విచారించి తమకు న్యాయం చేయాలని పేషెంట్ల కుటుంబ సభ్యులు, బందువులు డిమాండ్ చేస్తున్నారు.

Share
Share