APB News Exclusive: ఎపిసోడ్ -5: కతాలగూడలో కాంగ్రెస్, బీజేపీ ‘రియల్ దందా’?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడలో జరిగిన డబుల్ రిజిస్ట్రేషన్ భూముల అక్రమాలకు రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే మిస్సింగ్ సర్వే నంబర్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలతో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల పాత్రపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ ఎన్నికలప్పుడే ఇరు పార్టీల మధ్య లోపాయికారీ రాజకీయ దోస్తీ కుదిరిందని, అదే ఇప్పుడు కతాలగూడ భూముల వ్యవహారంలో ‘రియల్ దందా’ గా మారిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కతాలగూడలో కొత్త వెంచర్ సంబంధించి కొంత మంది రాజకీయ నాయకులు, రియల్టర్లు కలిసి ఒక పథకం ప్రకారం వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలోని కొందరు నేతలకు వెంచర్లలో నేరుగా పెట్టుబడులు లేకపోయినా వాటాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రతిఫలంగానే భూముల అక్రమాలు, డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో రాజకీయ అండ లభిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ తెర వెనక హైడ్రామా నడిపించిందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. బీజేపీ సీనియర్లను అడ్డం పెట్టుకుని ఆడిన డ్రామాలో కొత్త క్యాండేట్లు బలియ్యారు. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. సిట్టింగ్ కౌన్సిలర్లు సైతం పోటీకి దూరంగా ఉండటంతో పార్టీలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రిజర్వేషన్లు మారాయనే సాకుని అడ్డంపెట్టుకుని పోటీకి దూరంగా ఉన్న సీనియర్లు పరోక్షంగా కాంగ్రెస్ కు సహరించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఎన్జీ(NG) కాలేజీ నుంచి వీటీ కాలనీ పై భాగం వరకు బీజేపీ బలంగా ఉన్న డివిజన్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆలస్యంగా గుర్తించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ లీడర్లతో అంట కాగే బీజేపీ లీడర్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు పరోక్షంగా సహకరించారనేది బహిరంగ రహస్యమే. దీనిలో భాగంగానే కతాలగూడలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ కూడా బీజేపీ సీనియర్లదే కావడంతో భూముల క్రయ, విక్రయాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల గురించి స్థానిక కాంగ్రెస్ లీడర్లకు తెలిసినప్పటికీ ఎవరూ నోరుమెదపడం లేదు. చివరకు 11 డివిజన్ లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఎలక్షన్లు అయ్యాక కాంగ్రెస్ లో చేరినప్పటికీ పార్టీలో సరియైన గుర్తింపు ఇవ్వట్లేదనే చెప్తున్నారు. ఇదే వెంచర్ లో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మున్సిపాలిటీలో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోలేదని ఏపీబీలో ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన నల్లగొండ తహాశీల్దార్ 24 గంటల్లోనే విచారణకు ఆదేశించారు. సర్వే టీమ్స్ కతాలగూడలో వెంచర్ ప్రదేశానికి వెళ్లి సర్వే చేశారు, కానీ నక్షా ప్రకారం పరిశీలిస్తే అక్కడ బాట లేదని, ప్రభుత్వ జాగలేదని సర్వేయర్లు చెప్తున్నారు. సర్వేయర్లు చెప్పింది నిజమే అనుకుంటే మరి డబుల్ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు..? ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా జరిగింది? అనేది రికార్డులను లోతుగా పరిశీలిస్తే తప్పా తెల్వదు. అసలు భూమి లేని రైతులకు మిస్సింగ్ సర్వే నంబర్లు కేటాయించి, అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అమ్మేసిన వెంచర్లోని బాటలను మళ్లీ అవే సర్వే నంబర్లతో డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది తేలాల్సి ఉంది. రెవిన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరగలేదనే సాకును అడ్డంపెట్టుకుని జరిగిన ఈ అక్రమాల బాగోతంలో అసలు సూత్రదారులు ఎవరు? అనేది తేలాలంటే అధికారుల విచారణ నిష్పాక్షపాతంగా జరగాలని, లేదంటే కాంగ్రెస్, బీజేపీ లీడర్ల పైన వస్తోన్న అనుమానాలు నిజమేనని నమ్మాల్సి వస్తదని కతాలగూడ ప్రజలు అంటున్నారు.

కతాలగూడలో వెంచర్ వద్ద చెరువు కట్ట బాటను కొలుస్తున్న రెవిన్యూ సిబ్బంది
Share
Share