APB News Exclusive: నల్లగొండ కాంగ్రెస్ లో మండల మంటలు..

నల్లగొండ ప్రతినిది, ఏపీబీ న్యూస్: మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో వర్గ పోరుకు తెరలేపాయి. నకిరేకల్, తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గాల్లో కమిటీల ఎంపికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే పీసీసీ(PCC) ఆమోదం లభించిందని, సీనియర్ నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడేళ్ల పాటు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్లను తొలగించి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పీసీసీ కండీషన్ పెట్టింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరి, కనీసం మూడేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డ లీడర్లకు మండల కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలనే నిబంధన పెట్టింది. దీంతో చాలా చోట్ల పాతతరం కాంగ్రెస్ లీడర్లు పదవులు కోల్పోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొత్త నాయకత్వానికి ఎమ్మెల్యేలు పెద్దపీట వేశారు. నకిరేకల్, తుంగతుర్తి, మిర్యాలగూడెంలో ఎమ్మెల్యేల నిర్ణయంతో కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమంటున్నారు.

మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలలో పలుచోట్ల పాతతరం నాయకత్వానికి ప్రాధాన్యం తగ్గి, కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం పార్టీలో అసంతృప్తికి కారణమైంది. సీనియర్లను పక్కనబెట్టి ఎమ్మెల్యేల అనుచరులకు పదవులు కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ ని యోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గాల మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ కొన్ని మండల కమిటీల ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామరచర్ల, మిర్యాలగూడ రూరల్, టౌన్ కమిటీలో ఇరువర్గాలు పోటీ పడుతున్నాయి.

నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఎవరూ మాట్లాడకపోయినా, కమిటీల నియామకాలపై తమ అసంతృప్తిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లినట్లు సమాచారం. చిట్యాల, నార్కట్పల్లి, కేతేపల్లి, కట్టంగూరు, రామన్నపేట మండలాల్లో కమిటీల నియామకాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

చిట్యాల పట్టణ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తినే మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడంపై సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కట్పల్లి మండలంలో మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన ఊషయ్య గౌడ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించారని ఆరోపిస్తున్నారు. కేతేపల్లి, కట్టంగూరు మండలాల్లో కూడా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లను పక్కనబెట్టి ఎమ్మెల్యే అనుచరులకే మండల అధ్యక్ష పదవులు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గమైన కనగల్లో మాజీ జడ్పీటీసీ శ్రీను గౌడ్ను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అనూప్ రెడ్డిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడంతో అక్కడ కూడా వర్గ విభేదాలు తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గాన్ని రెండు బ్లాకులుగా విభజించి ఒకదానికి శ్రీను గౌడ్, మరొక బ్లాక్ కు మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యను నియమించారు.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలప్పుడు తలెత్తిన గొడవలను పీసీసీ నాయకత్వం పరిష్కరించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి కారణంగా 9 మండలాల్లో కాంగ్రెస్ నాయకత్వం తిరుగుబాటు చేసింది. సీనియర్ నేత యోగానందచార్యలు నేతృత్వంలో అన్ని మండలాల్లోని పార్టీ నాయకులు రోడ్ల పైకి వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో తుంగతుర్తి కాంగ్రెస్ కేడర్ లో ఆందోళన నెలకొంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం తిరుమలగిరిలో సూచించిన వ్యక్తులకు కూడా ఎమ్మెల్యే కమిటీలో చోటు కల్పించలేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సు చేసిన మద్దిరాల మండల కమిటీలో సైతం ఎమ్మల్యే తన వర్గానికే పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన లీడర్లనే ఎమ్మెల్యే సామేలు మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడంతో కమిటీలను రద్ధు చేయాలని ఎంపీ కిరణ్ పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే నియమించిన కమిటీలను తక్షణమే రద్ధు చేసి, తాను సూచించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, గుడిపాటి నర్సయ్య, బస్వరాజు సారయ్య, బీర్ల అయిలయ్య, కొండేటి మల్లయ్యలతో చర్చించి కమిటీల అధ్యక్షులను నియమించాలని ఎంపీ కిరణ్ పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. కాంగ్రెస్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ విభేదాలు తలెత్తడం పార్టీకి తీరని నష్టాన్ని తెస్తాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Share
Share