APB News Exclusive: పర్మిషన్ రాకముందే.. ఆలివ్ అడ్మిషన్ల దందా!

సూర్యాపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ నిబంధనలను నడిరోడ్డుపై పాతరస్తూ, కనీస అనుమతులు కూడా లేకుండానే ఆలివ్ ఇంటర్నేషనల్ స్కూల్’ పేరిట లక్షలాది రూపాయల అడ్మిషన్ల దందాకు తెరలేపారు. ఈ భారీ అక్రమ వ్యవహారంపై ఏపీబీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఉదంతం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సామాన్య తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలోనే అంతర్జాతీయ హంగులతో, భారీ హంగామా నడుమ ఈ విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరు చెప్పి, ఒక్కో సీటుకు లక్షల రూపాయల ఫీజులు డిమాండ్ చేస్తూ అమాయక పేరెంట్స్ను బురిడీ కొట్టిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభానికి అవసరమైన ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి పత్రం (Recognition/Permission) అందకముందే ఈ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ల వేటను ముమ్మరం చేసింది.

బోర్డుల మాయాజాలం: ‘సీట్లు అయిపోతున్నాయి.. త్వరగా బుక్ చేసుకోండి’ అంటూ ప్రచారం కల్పించి, స్కూల్ పూర్తిగా ఓపెన్ కాకముందే ఏకంగా ‘నో అడ్మిషన్స్’ (No Admissions) బోర్డు తగిలించి డిమాండ్ క్రియేట్ చేశారు.

లక్షల్లో వసూళ్లు: ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్ ఫీజు, డొనేషన్ల పేరిట రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు అడ్డగోలుగా దండుకుంటూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.

అధికారుల ఉదాసీనత: విద్యాశాఖ ఉన్నతాధికారి ప్రతిరోజూ ఈ స్కూల్ ముందరి నుంచే రాకపోకలు సాగిస్తున్నా, పర్మిషన్లపై వివరణ కోరగా “అవునా.. కాదా.. నాకు తెలియదు” అని సమాధానం ఇవ్వడం విద్యాశాఖ నిర్వాకానికి అద్దం పడుతోంది. ఒక్క ఆలివ్ స్కూలే కాకుండా జిల్లాలో ఇలా అనుమతులు లేకుండా నడుస్తున్న స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

కళ్ల ముందే ఇంత పెద్ద దందా సాగుతున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన మండల విద్యాధికారులు (MEOs), జిల్లా విద్యాధికారులు (DEO) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థి సంఘాల తీవ్ర ఆగ్రహం: కార్పొరేట్ యాజమాన్యాలు విసిరే భారీ ‘మామూళ్ల’ మత్తులో అధికారులు జోగుతున్నారని, అందుకే అక్రమ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్కు సైతం అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, ఆయన కూడా మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదని విమర్శలు వస్తున్నాయి.

గుర్తింపు లేని, పర్మిషన్ రాని క్లాసుల్లో తమ పిల్లలను చేర్పిస్తే రేపు వారి భవిష్యత్తు ఏమవుతుందో, బోర్డు పరీక్షల సమయంలో వారి సర్టిఫికెట్లు చెల్లుతాయో లేదోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ అడ్మిషన్ల దందాపై సూర్యాపేట జిల్లా విద్యాధికారి (DEO) అశోక్ ని వివరణ కోరగా ఆయన స్పందించారు. ప్రభుత్వ పర్మిషన్ రాకముందే స్కూల్స్ ఓపెన్ చేయడం, అడ్మిషన్లు నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. సదరు స్కూళ్ల పూర్తి వివరాలు ఇంకా తమ అంతర్గత పరిశీలనకు రాలేదని, తక్షణమే ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో అశోక్ భరోసా ఇచ్చారు.

Share
Share