APB News Exclusive: నల్లగొండకు కలుషిత కృష్ణా జలాలు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటికి బదులు కలుషితమైన కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పానగల్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో యంత్రాలు మొరాయించడం, సరైన నిర్వహణ లేకపోవడం, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో నీటి శుద్ధి ప్రక్రియ పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్లాంట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పానగల్లు లోని నల్లగొండ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇతర ప్లాంట్లతో పోలిస్తే బాగా పాత పడిపోయింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా సరైన మరమ్మతులు, ఆధునీకీకరణ పనులు చేపట్టక పోవడంతో ప్లాంట్లోని ఏరియేటర్లు, ఫిల్టర్ బెడ్లు, మోటార్లు, పైప్లైన్లు, ఆలం కలిపే మిషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా నీటి శుద్ధి ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. ఈ ప్లాంట్ కు పక్కనే ఉన్న ప్లాంట్లు కూడా అప్పటివే. కానీ నల్లగొండ ప్లాంట్ సరియైన మెయింటెన్స్ లేకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఉదయ సముద్రం నుంచి ఈ ప్లాంట్లోకి వస్తోన్న కృష్ణా జలాలు సరిగా శుద్ధి కావట్లేదు. పక్క ప్లాంట్లతో ఫిల్టర్ అయిన నీటితో పోలిస్తే ఈ ప్లాంట్లో నీళ్లు మురికిగా కనిపిస్తున్నాయి. అంతేగాక బెడ్లులో నీళ్లు సరిగా ఫిల్టర్ కాకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి.

చెడిపోయిన
ఆలం మిశ్రమాన్ని కలిపే మోటార్లు
చెడిపోయిన ఆలం మిశ్రమాన్ని కలిపే మోటార్లు

ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి ప్లాంట్లోకి చేరుతున్న కృష్ణా జలాలను సరిగా శుద్ధి చేయడం లేదు. రిజర్వాయర్ నుంచి పైప్లైన్ల ద్వారా ఏరియేటర్లోకి వస్తోన్న నీటిలో ఆలం మిశ్రమాన్ని కలపాల్సి ఉంటుంది. ఆలం మిశ్రమాన్ని కలిపే మిషన్లు, పైప్లైన్ వ్యవస్థ నాలుగేళ్ల క్రితమే దెబ్బ తిన్నది. దీంతో అప్పటి నుంచి రిపేరు చేయకుండా పక్కన పడేశారు. ఆపరేటర్లు ఆలం ముద్దలను నేరుగా ఏరియేటర్లో పడేస్తున్నారు. దీంతో ఆలం నీటిలో సమానంగా కలవక ముద్దలుగా మారి శుద్ధి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ప్రతిరోజూ ఫిల్టర్ బెడ్లను బ్యాక్వాష్ చేసి శుభ్రం చేయా ల్సి ఉండగా, చాలా కాలంగా ఆ ప్రక్రియ జరగడం లేదు. ఇసుక, మట్టి పేరుకుపోవడంతో ఫిల్టర్ సామర్థ్యం తగ్గిపోయి, శుద్ధి చేసిన నీటి డిశ్చార్జి గణనీయంగా పడిపోయింది.

బెడ్లను శుభ్రం చేయకపోవడంతో కలుషితంగా కనిపిస్తున్న కృష్ణా జలాలు
బెడ్లను శుభ్రం చేయకపోవడంతో కలుషితంగా కనిపిస్తున్న కృష్ణా జలాలు

సాధారణంగా ఉదయ సముద్రం నుంచి వచ్చే కృష్ణా జలాలకు మొదట సీఎల్ఎఫ్ (Clariflocculator)లో ఆలం కలిపి మలినాలను వేరు చేస్తారు. అక్కడి నుంచి వచ్చే సెటిల్ వాటర్ ఫిల్టర్ బెడ్లలోకి వెళ్లి పూర్తిగా శుద్ధి అయిన తర్వాత క్లియర్ వాటర్ (శుభ్రమైన నీళ్లు) నిల్వ ట్యాంకులకు చేరుతుంది. అయితే ప్రస్తుతం ఈ మొత్తం ప్రక్రియలో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిల్టర్ బెడ్ల నుంచి రావాల్సిన క్లియర్ వాటర్ పరిమాణం తగ్గిపోవడంతో ఏరియేటర్ నుంచి వచ్చే రావాటర్ (శుద్ధి చేయని నీళ్లు) అలాగే పూర్తిగా ఫిల్టర్ కాకముందే ఉండే సెటిల్ వాటర్ లో కలిపి నేరుగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఇళ్లలోకి వచ్చే నీరు శుభ్రంగా కనిపించడం లేదని, మురికిగా ఉంటోందని స్థానికులు చెపుతున్నారు. అంతేగాక ఇళ్లలోని వాటర్ ఫిల్టర్లకు మురికి అంటుకుని, ఫిల్టర్లు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు.

ఏరియేటర్ నుంచి వచ్చిన సెటిల్ వాటర్
ఏరియేటర్ నుంచి వచ్చిన సెటిల్ వాటర్

నల్లగొండ కార్పోరేషన్ కు రెండు ప్లాంట్ల నుంచి నీటి సరఫరా జరుగుతోంది. 2005లో ప్రారంభించిన ప్లాంట్ నుంచి ఒక ఏరియా, 2018లో ప్రారంభమైన ప్లాంట్ నుంచి మరొక ఏరియాకు నీటి సప్లై జరుగుతోంది. ఈ రెండు ప్లాంట్లలో నీటి శుద్ధ ప్రక్రియను పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తోంది. శుద్ధి చేసిన నీటిని పరిశీలిస్తే ఒక దాంట్లో పరిశుభ్రమైన కణాలు కనిపిస్తుండగా, పాత ప్లాంట్ నుంచి వచ్చే నీరు మురికి రూపంలో కనిపిస్తోంది. 2010-11 ఆర్ధిక సంఘం నిధుల నుంచి కొనుగోలు చేసిన ఫిల్టర్ బెడ్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో నీటి శుద్ధి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. సెటిల్ వాటర్లో ఉండే ఇసుక, మట్టి పెల్లలు, ఇతర మలినాలను శుద్ధి చేయాల్సిన బెడ్లు సరిగా పనిచేయకపోవడంతో పక్క ప్లాంట్లో శుభ్రమైన నీళ్లకు, పాత ప్లాంట్లోని నీళ్లలో రంగు, రుచిలో తేడా తెలుస్తోంది.

బెడ్లు శుభ్రం చేయకపోవడంతో మురికిగా కనిపిస్తున్న జలాలు
పక్కనే మిషన్ భగీరథ ప్లాంట్లోని బెడ్లలో శుభ్రంగా కనిపిస్తున్న కృష్ణాజలాలు
Share
Share