సిద్దిపేట కలెక్టరేట్‌లో దుబ్బాక ఎమ్మెల్యే సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సిద్దిపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వేదికగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు.

భూసార పరీక్షలు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శాస్త్రీయ పద్ధతిలో భూసార పరీక్షలు నిర్వహించి, రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు అధికంగా సన్నబియ్యం సాగు వైపు మొగ్గు చూపేలా విస్తృత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

మల్లన్నసాగర్ కెనాల్స్ రిపేర్లు: మల్లన్నసాగర్ కాల్వల పరిధిలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కెనాల్స్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. కాల్వల పరిధిలో విద్యుత్ స్తంభాలు, వైర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఇటీవల దుబ్బాకలోని కేసీఆర్ పాఠశాలను సందర్శించిన ఉదంతాన్ని ఎమ్మెల్యే ఈ సమావేశంలో ప్రస్తావించారు. అక్కడ పరిశుభ్రత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మౌలిక వసతులు పెంచాలని, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

హాస్టళ్ల తనిఖీకి ఎమ్మెల్యే కీలక సూచనలు: నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలి. విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత, బోధన తీరు, మరుగుదొడ్లు, తాగునీరు మరియు పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

అలాగే, దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరతను తక్షణమే భర్తీ చేయాలని, నిపుణులైన డాక్టర్లను నియమించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు కల్పించి ఆసుపత్రిని మరింత బలోపేతం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ను డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అవసరమైన అన్ని గ్రామాల్లో కొత్త తాగునీటి ట్యాంకులను మంజూరు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు దుబ్బాక నియోజకవర్గ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ‘కార్మిక భవనం’ మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Share
Share