Breaking News: ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ..? సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మునుగోడు, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించాయి. ఈ వివాదాస్పద ఉదంతం గాంధీ భవన్ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్లో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పదునైన విమర్శలు గుప్పించారు.

పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు లేకుండా పోతోందని, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్లదే ఇప్పుడు అంతా నడుస్తోందని ఆయన ఓపెన్గా అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ కారణం చేతనే తాను నల్లగొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు హాజరుకాలేదని స్పష్టం చేశారు.

లైవ్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నడుస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం రాష్ట్రంలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు..? రోజురోజుకు వారు కనుమరుగవుతున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన కొత్తవాళ్లకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు, అంతా వాళ్ళదే నడుస్తుంది” అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రిపై అసంతృప్తి: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అస్సలు బాలేదని, ప్రభుత్వంలో పనికంటే షో అప్స్ (ఆర్భాటాలు) ఎక్కువయ్యాయని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

యాదగిరిగుట్ట బోర్డు వివాదం: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి (యాదగిరిగుట్ట) ఆలయ ధర్మకర్తల మండలి (Temple Board) నియామకాలపై స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్న పట్టును కాదని, నియోజకవర్గాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంపై రాజగోపాల్ రెడ్డి గట్టిగా నిలదీశారు. “నేను ఒక సీనియర్ నేతను, సిట్టింగ్ ఎమ్మెల్యేను.. అలాంటి నాకే యాదగిరిగుట్ట బోర్డు విషయంలో కనీస సమాచారం చెప్పకుంటే ఎలా?” అని ప్రశ్నించారు.

నల్లగొండ సభ ఎందుకు స్కిప్ చేశారంటే: జిల్లాలో సీఎం సభలకు తాము పగలు రాత్రి కష్టపడితే.. వేదికలపై ప్రాధాన్యత మాత్రం ఇతరులకు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వ పద్ధతులు తనకు నచ్చకనే నల్లగొండ బహిరంగ సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి లైవ్లోనే బాంబు పేల్చారు.

కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడం, జిల్లా రాజకీయాల్లో సీఎంవో (CMO) నేరుగా జోక్యం చేసుకుని పాత కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టడం వల్లే రాజగోపాల్ రెడ్డి ఇంతటి తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకు క్లోజ్ అవుతుంటే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Share
Share