APB News Exclusive: సీఎం వేదికపై హైడ్రామా? ఎవరికేం జరిగింది?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముగిసిన తర్వాత వేదికపై చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి, సీఎం భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వివాదం వెనుక అసలేం జరిగిందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముఖ్యమంత్రి నల్లగొండకు చేరుకున్న వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మేయర్ బుర్రి చైతన్య, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీఎం బహిరంగ సభలో ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించారు. సభ అనంతరం మహిళా కార్పొరేటర్లను ముఖ్యమంత్రికి పరిచయం చేయాలని శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నించారు. అప్పటికే వేదికపై గుమ్మల మోహన్ రెడ్డి, పాశం రాంరెడ్డి, అమిత్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య, హాఫీజ్ ఖాన్తో పాటు పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్న గుమ్మల మోహన్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకు పరిచయం చేశారు. అదే సమయంలో మహిళా కార్పొరేటర్లను కూడా సీఎంకు పరిచయం చేస్తే ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవని శ్రీనివాస్ రెడ్డి భావించారు. మేయర్ చైతన్య, మోహన్ రెడ్డి ఇప్పటికే సీఎంను కలిసినందున కార్పొరేటర్లను కూడా కలిపి ఫొటో దిగే అవకాశం కల్పించాలని ప్రయత్నించారు. మహిళా కార్పొరేటర్లు కూడా సీఎంతో కలిసి ఫొటో దిగేందుకు ఆసక్తి చూపారు. అయితే అప్పటికే హెలికాప్టర్ బయలుదేరే సమయం సమీపించింది. మరింత ఆలస్యమైతే చీకటి పడే అవకాశం ఉండటంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన భద్రతా సిబ్బంది సీఎంను ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు.

వాస్తవానికి సభ అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కొనసాగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగాలు ఎక్కువ సమయం తీసుకోవడంతో సీఎం బయలుదేరే షెడ్యూల్ ఆలస్యమైంది. ఈ విషయంపై పూర్తి స్పష్టత లేకపోవడం తో మహిళా కార్పొరేటర్లను సీఎంకు పరిచయం చేయాలనే తొందరలో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని భద్రతా సిబ్బంది వెనక్కి నెట్టినట్లు సమాచారం. సభ విజయవంతం కావడానికి రోజుల తరబడి కష్టపడి పనిచేసిన తమను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం పక్కనే ఉన్నప్పటికీ, భద్రతా నిబంధనల కారణంగా జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోయింది. చివరకు అక్కడే ఉన్న పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సభా వేదికపై కొద్ది నిమిషాల పాటు చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రస్తుతం నల్లగొండ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Share
Share