- ఒకప్పుడు సీఎం రేసులో ఉన్నానన్న మంత్రి..
- ఇప్పుడు రేవంత్‌కు మరింత చేరువ?
- సభా వేదికపై సీఎం పక్కనే నిలబడటం పై పార్టీలో ఆసక్తికర చర్చ
- మంత్రి పదవి, భవిష్యత్ రాజకీయాల కోసమే వైఖరిలో మార్పా? అంటూ విపక్షాల విమర్శలు..
- మారుతున్న సమీకరణాల్లో మంత్రి వెంకటరెడ్డి వ్యూహాత్మక అడుగులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ మంత్రిగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ వైఖరిలో మార్పు కనిపిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు తాను కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని బహిరంగంగా ప్రకటించిన వెంకటరెడ్డి.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. నల్లగొండలో జరిగిన సీఎం సభలో వేదికపై రేవంత్ రెడ్డి పక్కనే ఉండి కార్యక్రమాన్ని సమన్వయం చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకునే ఆయన తన వైఖరిని మార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మంత్రి పదవిని కాపాడుకోవడానికే ఈ మార్పు అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిత్ర సృష్టించారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన వెంకటరెడ్డి, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. 2018లో ఓటమి ఎదురైనా, ఏడాదిలోనే జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి తన రాజకీయ బలం ఏమిటో మరోసారి నిరూపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన వెంకటరెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ముందే మంత్రి పదవి చేపట్టిన నాయకుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నాయకుడిగా మాత్రమే కాకుండా, రాజకీయంగా ఎంతో మందిని ఎదిగించిన వ్యక్తిగానూ వెంకటరెడ్డి పేరు వినిపిస్తుంది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి బలమైన అండగా నిలవడంతో పాటు చిరుమర్తి లింగయ్య వంటి నాయకుల ఎదుగుదలలోనూ కీలక పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీర్ల అయిలయ్య, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి వంటి తొలి తరం నాయకులకు అండగా నిలిచి వారి విజయానికి కృషి చేశారు. ఇంతటి రాజకీయ అనుభవం, ప్రజాదరణ, జిల్లా కాంగ్రెస్పై బలమైన పట్టు ఉన్న వెంకటరెడ్డి.. ఇటీవల తన రాజకీయ వైఖరిలో కనిపిస్తున్న మార్పులతో మరోసారి చర్చనీయాంశంగా మారారు.
మాస్ లీడర్ గా ప్రజల్లో గుర్తింపు..
ఒకప్పుడు స్వతంత్ర రాజకీయ శైలితో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారా? లేక భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ కాంగ్రెస్తో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మాస్ లీడర్ గా ప్రజల్లో గుర్తింపు పొందిన వెంకటరెడ్డి తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన రోజుల నుంచి ఇప్పుడు తన పదవిని కాపాడుకునేందుకు వెనకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆదివారం నల్లగొండలో జరిగిన సీఎం సభలో వెంకటరెడ్డిలో వచ్చిన మార్పు గురించి జిల్లా పార్టీలో చర్చ నడుస్తోంది.
రేవంత్ పక్కనే వెంకటరెడ్డి..
నల్లగొండలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఓ దృశ్యం కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సీఎం ప్రసంగిస్తున్నంతసేపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పక్కనే నిలబడి ఉండడం పార్టీ నాయకులు, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు లేదా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు వేదికపై తమ స్థానాల్లో కూర్చోవడం ఆనవాయితీ. ఎన్నికల ప్రచార సభల్లో మాత్రం అభ్యర్థులు సీఎం పక్కన నిలబడటం తరచూ కనిపించే దృశ్యం. అయితే ఈ సభలో వెంకటరెడ్డి చేతులు కట్టుకుని సీఎం పక్కనే నిలబడటం కొత్త చర్చకు తెరలేపింది. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఎంపీ రఘువీర్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య వేదికపై ఉండడం సహజమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నా, రాష్ట్ర కేబినెట్లో అత్యంత సీనియర్ మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి అదే విధంగా సీఎం పక్కనే నిలబడటం కొందరు కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకప్పుడు తాను కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని బహిరంగంగా ప్రకటించిన వెంకటరెడ్డి.. ఇప్పుడు రేవంత్ రెడ్డే పదేళ్ల పాటు సీఎం పదవిలో ఉంటాడని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తుంది. కానీ వచ్చే ఐదేళ్లు కూడా తానే సీఎం అని రేవంత్ ప్రకటించుకోవడం, దానికి మంత్రి వెంకటరెడ్డి మద్ధతు తెలపడం అనేది రాజకీయ వ్యూహాంలో భాగంగానే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మంత్రి పదవి కాపాడుకునేందుకేనా..?
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో చోటు కల్పించేందుకు అన్న వెంకటరెడ్డిని పక్కకు తప్పిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ అసలు రాజగోపాల్ మంత్రి పదవి హామీ గురించి తనతో ఎవరూ చర్చించలేదని, ఆయన పై వస్తున్న ప్రచారాన్ని ఎన్నో సార్లు వెంకటరెడ్డి వ్యతిరేకించారు. కానీ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అధిష్టానం వైఖరి, భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకునే తన రాజకీయ శైలిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవిని కొనసాగించుకోవడం, భవిష్యత్ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం.
సీఎంను దేవుడితో కీర్తించిన వెంకటరెడ్డి..
ఆదివారం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పరస్పర ప్రశంసలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతంలో పలుమార్లు సొంత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచిన వెంకటరెడ్డి.. ఈసారి మాత్రం ముఖ్య మంత్రి నాయకత్వాన్ని ఆకాశానికెత్తుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పాలనను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనతో పోల్చిన వెంకటరెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్లే ఆ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రస్తావిస్తూ, “దేవుడిని మొక్కితే వరం వస్తుందో రాదో తెలియదు.. కానీ అడగకుండానే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రజలకు గొప్ప వరం ఇచ్చారు” అంటూ సీఎం నాయకత్వాన్ని ప్రశంసించారు. సీఎం చొరవ వల్లే నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ గాడిలో పడ్డాయని, 2028 నాటికి ఎస్ఎల్బీసీ(SLBC), డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను సీఎం చేతుల మీదుగానే ప్రారంభించి కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి కూడా వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ ప్రజలు గర్వంగా చెప్పుకునే నాయకుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఆయనను, ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీతో పోలుస్తూ ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి పదవి చేపట్టడం వెంకటరెడ్డి రాజకీయ నిబద్ధతకు నిదర్శనమని రేవంత్ వ్యాఖ్యానించారు.