Breaking News: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత.. కార్పొరేటర్ల బూతుల పర్వం..

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం తీవ్ర రచ్చ రచ్చగా మారింది. పట్టణంలోని వార్డుల సమస్యలు, ఐదు నెలలుగా నిలిచిపోయిన అభివృద్ధి నిధులపై కౌన్సిల్ హాల్ వేదికగా అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మున్సిపల్ ఉదంతం స్థానిక రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో కౌన్సిల్ సమావేశం కాస్తా రణరంగంగా మారింది.

రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సమావేశంలోనే అందరికీ కనిపించేలా ఒక పెద్ద నిరసన బ్యానర్ను ప్రదర్శించారు. ఆయన సమస్యలపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒక్కసారిగా ఆయనపైకి ఎదురుదాడికి దిగడంతో గొడవ మొదలైంది.

నిరసన తెలుపుతున్న కార్పొరేటర్లకు మద్దతుగా 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ కూడా రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ఏర్పడి ఇన్ని రోజులైనా ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమవుతున్నామని ఆయన బల్లగుద్ది నిలదీశారు.

బూతుల పర్వం – దూషణలు: ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటలు ముదిరి.. “నువ్వు ఎంత అంటే.. నువ్వు ఎంత” అంటూ ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.

పోలీసుల ఎంట్రీ: దాదాపు పది నిమిషాల పాటు సమావేశ మందిరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్పొరేటర్లు ఒకరిపైకొకరు భౌతిక దాడికి దిగే పరిస్థితి రావడంతో.. అక్కడే ఉన్న తోటి కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బందితో పాటు భద్రతకు వచ్చిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించి వెనక్కి నెట్టేశారు.

మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. వార్డుల అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విపక్ష కార్పొరేటర్లు సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే పాత నిధులను సైతం తొక్కిపెడుతూ పట్టణాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యలు అడిగితే అధికార బలంతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, నల్లగొండ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధుల పంపిణీలో వివక్ష వీడకుంటే కలెక్టరేట్ ముట్టడికి వెళ్తామని కార్పొరేటర్లు హెచ్చరించారు.

Share
Share