APB న్యూస్ ఎఫెక్ట్: ‘శ్రీ త్రివేణి’ పాఠశాలకు విద్యాశాఖ నోటీసులు..

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఏపీబీ న్యూస్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనల ఉల్లంఘనలు, సెలవు రోజుల్లో బుక్స్ దందాపై APB న్యూస్ ప్రచురించిన వరుస ఇన్వెస్టిగేటివ్ కథనాలకు విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ స్కూళ్లలో సాగుతున్న వ్యాపార కమర్షియల్ దందాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్లను పురస్కరించుకుని ఉన్నతాధికారులు శనివారం తక్షణ చర్యలు చేపట్టారు.

ఈ సంచలన ఉదంతం శనివారం రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పత్రికా కథనాలతో నిద్రలేచిన అధికారులు నేరుగా స్కూల్ క్యాంపస్కు చేరుకుని తనిఖీలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

జూన్ 26న బాలాపూర్ బి.ఎన్.రెడ్డి నగర్ (వినాయక హిల్స్) లోని ‘శ్రీ త్రివేణి’ స్కూల్లో మొహరం ప్రభుత్వ సెలవు దినాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహించడం, కనీస ప్రభుత్వ అనుమతులు లేకపోవడం, పాఠశాల ప్రాంగణానికి ఆనుకుని ఉన్న షెట్టర్లలో బుక్స్, యూనిఫాంలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ‘ఏపీబీ న్యూస్’ సాక్ష్యాధారాలతో వరుస కథనాలను ప్రచురించింది.

విద్యాశాఖ గైడ్లైన్స్ పక్కనబెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారంటూ జూన్ 26 వరకు పత్రికలో వచ్చిన కథనాలు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం (జూన్ 27) నాడు అధికారులు స్కూల్లో క్షేత్రస్థాయి విచారణ జరిపారు.

ఈ తనిఖీల విషయమై బాలాపూర్ మండల విద్యాశాఖ అధికారి (MEO) కృష్ణయ్య శనివారం ‘ఏపీబీ న్యూస్’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

క్షేత్రస్థాయి తనిఖీలు: ఏపీబీ న్యూస్ పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా తాము శ్రీ త్రివేణి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించామని, క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.

వివరణ ఇవ్వాలని ఆదేశం: లీగల్ పర్మిషన్లు లేకుండా స్కూల్ రన్ చేయడం, కమర్షియల్ విక్రయాలు జరపడంపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖ తరఫున అధికారికంగా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ స్పష్టం చేశారు.

కఠిన చర్యల హెచ్చరిక: విద్యాశాఖ మార్గదర్శకాలను అతిక్రమించి, పండుగ సెలవుల్లో స్కూల్ నడిపితే పాఠశాల గుర్తింపు రద్దుతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ వసూళ్లు, అనుమతుల అంశంపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని, కానీ ఏపీబీ న్యూస్ వరుస కథనాలతో కేవలం 24 గంటల్లోనే అధికారులు దిగివచ్చారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలపై, విద్యావ్యవస్థలోని లోపాలపై ‘ఏపీబీ న్యూస్’ నిరంతరం అందిస్తున్న పారదర్శక కథనాలకు ఈ నోటీసుల జారీయే మరొక నిదర్శనమని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు నగరంలో హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Share
Share