సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల బహిరంగ లేఖ.. మంత్రి కోమటిరెడ్డిపై నిప్పులు..

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి నల్లగొండ జిల్లాకు విచ్చేస్తున్న సీఎం ఏ. రేవంత్ రెడ్డి పర్యటన వేళ స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నల్లగొండ నియోజకవర్గ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి ఒక పదునైన బహిరంగ లేఖ రాశారు. ఈ పర్యటనను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో నల్లగొండ నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కేసీఆర్ హయాంలో మంజూరైన వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన నిప్పులు చెరిగారు.

ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి గాల్లో తిరుగుతూ నల్లగొండ ప్రజలను గాలికి వదిలేశారని, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను తన నివాసంగా మార్చుకోవడానికే పరిమితమయ్యారని లేఖలో ఆరోపించారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని రూ. 1500 కోట్ల నిధులు ప్రకటించారని, వాటితో ప్రారంభమైన పనులను కాంగ్రెస్ నాయకులు కమీషన్ల కోసం నిలిపివేశారని కంచర్ల ఆరోపించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ నుంచి రామగిరి, రైల్వే ఫ్లైఓవర్ రోడ్లు అద్వానంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు.

“మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసమైన ఇందిరా భవన్ నుంచీ ఎదురుగా కనిపిస్తున్న నల్లగొండ కళాభవన్ నిర్మాణం కోసం ఈ రెండున్నరేళ్లలో తట్టేడు మట్టి కూడా తీయలేదు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తూ పబ్లిసిటీ స్టంట్లతో కాలం వెళ్లదీస్తున్నారు” అని కంచర్ల భూపాల్ రెడ్డి తన లేఖలో ఘాటుగా విమర్శించారు.

నల్లగొండ నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మళ్లింపు మరియు కాంగ్రెస్ నేతల భూఆక్రమణలపై కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ ద్వారా సంధించిన ప్రధాన డిమాండ్ల పట్టిక కింద ఇవ్వబడింది.

క్రమసంఖ్యగత ప్రభుత్వ ప్రాజెక్టు / హామీబీఆర్ఎస్ డిమాండ్ / లేఖలోని ప్రధానాంశాలు
1రోడ్ల నిర్మాణంముషంపల్లి, నర్సింగ్ భట్ల, మాడుగుల పల్లి, మామిడాల రోడ్లను ఎందుకు పూర్తి చేయలేదు?
2టూరిజం & ఆలయాలుపానగల్ ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, ఛాయా, పచ్చల ఆలయాల కొరకు కేటాయించిన రూ. 119 కోట్ల నిధులు ఏమయ్యాయి?
3ఐటీ టవర్ & వల్లభరావు చెరువురూ. 90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఎందుకు నిరుపయోగంగా ఉంచారు? రూ. 15 కోట్ల చెరువు సుందరీకరణ పనులు ఎందుకు ఆపారు?
4కళాభారతి & ఎన్జీ కాలేజీరూ. 93 కోట్ల నల్లగొండ కళాభారతి, రూ. 36 కోట్ల నాగార్జున కళాశాల పనులను ఎందుకు తొక్కిపెట్టారు?
5భూ ఆక్రమణలపై విచారణకాంగ్రెస్ నేతలు ప్రభుత్వ, వక్ఫ్ భూములు ఆక్రమించి ప్రైవేట్ వెంచర్లు చేయడంపై విచారణ జరిపించాలి.
6మున్సిపల్ అవినీతిమున్సిపల్ నిధులతో కాంగ్రెస్ నేతల సొంత వెంచర్లలో సీసీ రోడ్లు వేయడంపై తక్షణ విచారణ చేపట్టాలి.
7ఎన్నికల మేనిఫెస్టో హామీలురూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 15 వేల రైతు భరోసా, మహిళలకు రూ. 2500, తులం బంగారం తక్షణమే అమలు చేయాలి.

నల్లగొండ నియోజకవర్గ శాశ్వత వికాసం కోసం, సాగునీటి రంగాల పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా తక్షణమే భారీ నిధులు మంజూరు చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

లేఖ ముగింపులో ఆయన డిమాండ్ చేస్తూ.. ఏఎంఆర్పీ (AMRP) కాలువల లైనింగ్ పనుల కోసం రూ. 1500 కోట్లు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనుల పూర్తి కొరకు మరో రూ. 500 కోట్లు, అలాగే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ కొరకు రూ. 500 కోట్లతో పాటు.. మొత్తం నల్లగొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం రూ. 3000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమంత్రి వెంటనే ప్రకటించాలని కోరారు. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చని పక్షంలో నల్లగొండ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలను ఉధృతం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

Share
Share