- పోలీసుల ధర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ నిజాలు
- అస్లాం సైకో తరహా ప్రవర్తనతో నివ్వెరపోయిన ఖాకీలు
- ఇలాంటి మర్డర్ చూడటం కేరీర్లో ఫస్ట్ టైం అంటున్న ఆఫీసర్లు
- విచారణలో హాసీనా కాలనీవాసులు స్పందించకపోవడం వెరీబ్యాడ్
- అస్లాం కదలికల పైన అప్రమత్తత లేకపోవడంతోనే దారుణం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ప్రజలను మాత్రమే కాదు, పోలీసు శాఖను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హత్య జరిగిన తీరు, దాని వెనుక ఉన్న కారణాలపై మొదటి నుంచే అనేక ఊహాగానాలు వినిపించాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వైరల్ కావడంతో కేసుపై మరింత గందరగోళం నెలకొంది. చివరకు హత్య చేసింది అస్లాం ఒక్కడేనని పోలీసులు నిర్ధారించినప్పటికీ, “ఒక వ్యక్తి ఒక్కడే నలుగురిని ఎలా హత్య చేశాడు? అతడి వెనుక మరెవరైనా ఉన్నారా?” అనే సందేహాలు ప్రజల్లో ఇంకా కొనసాగుతున్నాయి. అయితే అస్లాంను లోతుగా విచారించిన పోలీసులు అతడి వ్యక్తిత్వం, గత జీవితం, నేర ప్రవృత్తి గురించి పలు కీలక విషయాలను గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం, తబస్సుంను వివాహం చేసుకునే ముందు అస్లాం కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. ఆ సంబంధం విఫలమైన తర్వాత తబస్సుంను వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం కొంతకాలం కువైట్కు వెళ్లి తిరిగి వచ్చిన అస్లాం, పెళ్లికి ముందే చెడు అలవాట్లకు బానిసయ్యాడని దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నించడం, జల్సాలకు అలవాటు పడటం, కుటుంబ పోషణలో విఫలం కావడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం వంటి పరిణామాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని పోలీసులు చెబుతున్నారు. అప్పుల భారం పెరిగే కొద్దీ అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, క్రమంగా క్రూరమైన మనస్తత్వం పెరిగిందని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అస్లాం ప్రవర్తన కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. నలుగురి హత్యపై అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, భావోద్వేగాలు ప్రదర్శించలేదని అధికారులు చెబుతున్నారు. అతడి తీరు సైకో తరహాలో ఉందని, అదే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
హాసీనా భర్త, కొడుకు పైన అనుమానాలు
హాసీనా కుమారుడి ప్రేమ వ్యవహారం కారణంగానే హత్య జరిగిందని కొందరు ప్రచారం చేశారు. మరికొందరు హాసీనా భర్తపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండానే అనేక కథనాలు ప్రచారంలోకి రావడంతో ఈ కేసుతో సంబంధం లేని కుటుంబాలు కూడా మానసిక క్షోభకు గురియ్యాయి. చివరకు నలుగురిని హత్య చేసింది ఒకడేనని పోలీసులు వెల్లడించడంతో ప్రజలు, మీడియా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఒకడే తెల్లవారుజామున ఒకే ఇంట్లో నలుగురిని హత్య చేయడం ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాధితుల అరుపులు బయటకు వినిపించలేదా? వినిపించి ఉంటే చుట్టుపక్కల వారు ఎందుకు స్పందించలేదు? అనే సందేహాలు ప్రజల్లో కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరిలోనే పసిగట్టి ఉంటే..
ఈ కేసులో మరో కీలక అంశం ఏమిటంటే ఫిబ్రవరిలో అస్లాం అదే ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. అప్పుడే అతనిపై ఫిర్యాదు నమోదై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే హత్య జరిగిన రాత్రి హైదరాబాద్ నుంచి నల్లగొండ కు వచ్చిన అస్లాం, “డ్యూటీ పనిమీద వచ్చాను.. ఈ రాత్రి మీ ఇంట్లోనే ఉంటాను” అని చెప్పిన సమయంలో హాసీనాకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణం నివారించే అవకాశం ఉండేదని దర్యాప్తులో పాల్గొన్న అధికారులు భావిస్తున్నారు. నిందితుడిని గుర్తించడం పోలీసులకు కూడా అంత సులభం కాలేదు. మీడియాలో వస్తున్న ప్రచారాల కారణంగా అసలు నిందితుడు తప్పించుకునే అవకాశం ఉందన్న ఆందోళనతో పోలీసులు రేయింబవళ్లు శ్రమించారు. అనుమానం వచ్చిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ దాదాపు 60 మందిని విచారించారు. హాసీనా మొదటి, రెండో భర్తల కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. హాసీనా కుమారుడి ప్రేమ వ్యవహారం కోణంలో ప్రచారం జరగడంతో, ఆ కుటుంబంతో సంబంధం ఉన్న వారినీ విచారించాల్సి వచ్చింది. చివరకు వీటిలో ఏ కోణంలోనూ ఆధారాలు లభించలేదు.
కేసును మలుపు తిప్పిన హాసీనా ఫోన్..
కేసులో మలుపు తిప్పింది హాసీనా మొబైల్ ఫోన్ కాల్ డేటానే. కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు అస్లాంపై దృష్టి సారించారు. అనంతరం అతడిని, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో అస్లాం భార్య తబస్సుం కూడా భర్తను కాపాడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అస్లాం ఫోన్ నుంచి హాసీనా కు వెళ్లిన కాల్స్ గురించి ప్రశ్నించగా, తానే హాసీనాకు ఫోన్ చేసి కుటుంబ విషయాలు అడిగానని తబస్సుం చెప్పింది. వెంటనే కాల్ ఎందుకు కట్ అయిందని ప్రశ్నించగా, ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో మరో ఫోన్ నుంచి మాట్లాడానని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. హత్య జరిగిన రోజే అస్లాం ఫోన్ నుంచి హాసీనాకు పలుమార్లు కాల్స్ వెళ్లినట్లు సాంకేతిక ఆధారాలు నిర్ధారించడంతో పోలీసులు అతడిని కఠినంగా ప్రశ్నించారు. చివరకు అస్లాం నేరాన్ని అంగీకరించడంతో కేసు మిస్టరీ వీడింది.
కాలనీ పేరు తెలంగాణ.. నోరెత్తని జనాలు
హాసీనా నివసిస్తున్న కాలనీ పేరు తెలంగాణ. కాలనీకి గొప్ప పేరు అయితే పెట్టారు కానీ అక్కడి ప్రజల తీరును చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు అంటే దాదాపు చుట్టుపక్కల వాళ్లు అంతా మేల్కొని ఉండే సమయం. ఆ సమయంలో హాసీనా ఇంట్లో నలుగురిని హత్య జరుగుతున్న క్రమంలో బాధితుల అరుపులు, కేకలు కచ్చితంగా బయటకు వినిపిస్తాయి. అస్లాం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూశామని చెప్పిన వ్యక్తులు కూడా తర్వాత పోలీసు విచారణలో సహరించకపోవడం గమనార్హం. హాసీనా ఇంటి నుంచి అరుపులు వినిపించాయని చెప్పిన వారు కూడా తర్వాత సైడయ్యారు. గతంలోనే ఈ ఇంట్లో దొంగతనం జరిగిందనే విషయం కాలనీ వాసులకు తెలిసినప్పటికీ ఎందుకు గోప్యంగా ఉంచారనేది పోలీసులకు అంతుచిక్కలేదు. ఇలాంటి కేసుల్లో స్థానికులు, ప్రజల సహకారం అవసరమని, అప్పుడు మాత్రమే ప్రజలకు, బాధితులకు న్యాయం జరుగుతుదని పోలీసులు చెప్తున్నారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు ఎంత కీలకమో, అలాగే అనుమానాస్పద సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.