APB News Exclusive: రాజగోపాల్ మౌనం..? దేనికి సంకేతం?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, బహిరంగ సభలు జరుగుతున్నా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి ఆశించిన ఆయనకు ఇప్పటివరకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తితోనే సభలకు హాజరుకావడం లేదనే ప్రచారం సాగుతోంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదనే సంకేతాలు వస్తుండటంతో రాజగోపాల్ రాజకీయ భవిష్యత్పై కొత్త చర్చ మొదలైంది. ఏఐసీసీ(AICC) లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తేనే కేబినెట్లో ఖాళీ ఏర్పడి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మంత్రి పదవి ఆశలు నెరవేరకపోవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని ఆయన ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. రాష్ట్ర అభివృద్ధి అంతా సీఎం, మంత్రుల సొంత నియోజకవర్గాలకే పరిమితమైందని, నిధులన్నీ కొడంగల్ వైపే మళ్లిస్తున్నారని రాజగోపాల్ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మునుగోడు అభివృద్ధి కోసం అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని గతంలోనే ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పుడు పార్టీ నాయకులు మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే ఆయన నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందా? అనే సందేహాలు కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తిరిగి వచ్చిన సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామనే హామీ ఇచ్చిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే వాదన అధిష్టానం వద్ద వినిపించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు.

మరోవైపు రాజగోపాల్కు మంత్రి పదవి ఇవ్వాలంటే తన భార్య పద్మావతిని కేబినెట్లోకి తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధిష్టానం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డి తన అన్న, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎలాంటి చర్చలు జరపలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన అన్నను మంత్రి పదవి నుంచి తప్పించి తనకు అవకాశం ఇస్తామన్నా అంగీకరించబోనని కూడా రాజగోపాల్ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ కలిసి కేబినెట్ విస్తరణ మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలపై ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇదిలా ఉంటే, త్వరలో ఏఐసీసీ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న ఏదైనా కీలక రాష్ట్రానికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వెంకటరెడ్డి ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర కేబినెట్లో ఖాళీ ఏర్పడి, ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాజగోపాల్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు కేబినెట్ విస్తరణ కంటే ఎక్కువగా ఏఐసీసీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది.

Share
Share