- టెస్టింగ్ ల్యాబ్ లేకుండా తాగునీటి సరఫరా..
- నల్లగొండలో కలుషిత జలాలపై తీవ్ర అనుమానాలు
- క్లోరిన్ ప్రమాణాలు పాటించకపోతే బ్యాక్టీరియా ముప్పు..
- కలుషిత నీరు ప్రజల ఇళ్లకే చేరుతున్నదా?
- ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన అధికారులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ నగర ప్రజల్లో తాగునీటి సరఫరాపై అనుమానాలు పెరుగుతున్నాయి. నీటి పరిమాణం సరిపోతున్నా, దాని నాణ్యతను పరీక్షించే వ్యవస్థ సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పానగల్లులోని మున్సిపాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద (నీటి శుద్ధి కేంద్రం) టెస్టింగ్ ల్యాబ్ లేకపోవడడంతో ప్రతి రోజు చేయాల్సిన నీటి నాణ్యత పరీక్షలు జరగకపోవడం, క్లోరిన్, ఆలం మోతాదులు ప్రమాణాలకు తగ్గట్లేదన్న అంశాలు ప్రజారోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. పక్కన ఉన్న అన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో తరచూ నీటి పరీక్షలు జరుగుతున్నా.. మున్సిపాలిటీ ప్లాంట్లో మాత్రం ల్యాబ్ మూత పడింది. కేవలం ఆపరేటర్ల సాయంతోనే ప్లాంట్ నడుస్తోంది. ప్లాంట్ వద్ద చేయాల్సిన నీటి పరీక్షలు, ఎక్కడో ప్రైవేటుగా బయట చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ట్రీట్మెంట్ ప్లాంట్ నీటి శుద్ధిలో నిర్లక్ష్యం..
ఉదయ సముద్రం రిజర్వాయర్లోని ఇంటేక్ వెల్ నుంచి వచ్చే రా వాటర్ లో మట్టి, బురద ఎక్కువగా ఉంటే ముందుగా టర్బిడిటీ పరీక్ష నిర్వహించాలి. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాలను బట్టి అవసరమైన మోతాదులో ఆలం (Alum) మిశ్రమాన్ని కలపాలి. దీంతో నీటిలోని మట్టి, బురద తదితర సూక్ష్మ కణాలు కిందకు చేరి, నీరు కొంతవరకు శుద్ధి అవుతుంది. అనంతరం క్లియర్ వాటర్పై మరోసారి టర్బిడిటీ పరీక్ష నిర్వహించి, నీటి నాణ్యతను నిర్ధారించాలి. Bureau of Indian Standards (BIS) ప్రమాణాల ప్రకారం క్లియర్ వాటర్లో టర్బిడిటీ 1 NTU (Nephelometric Turbidity Unit) ఉంటే ఉత్తమం. గరిష్టంగా 5 NTU వరకు మాత్రమే అనుమతించ బడుతుంది. అలాగే శుద్ధి చేసిన నీరు ప్రజల ఇళ్లకు చేరే సమయానికి 0. 2 ppm రెసిడ్యువల్ క్లోరిన్ ఉండాలి. ఈ స్థాయి ఉంటే నీటిలో హానికర బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఉదయ సముద్రం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్లో ఆలం మిశ్రమాన్ని నీటిలో సమపాళ్లలో కలపాల్సిన డోసింగ్ మోటార్లు చాలా కాలంగా పనిచేయడం లేదని సమాచారం. దీంతో ఆపరేటర్లు ఆలం ముద్దలను ఏరియేటర్లో చేతులతోనే వేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఆలం ద్రావణాన్ని డోసింగ్ మోటార్ల ద్వారా నిర్ణీత మోతాదులో కలపాలి. అలా చేసినప్పుడే నీటిలోని మట్టి, బురద, ఇతర సూక్ష్మ కణాలు సమర్థవంతంగా తొలగుతాయి. కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడంతో ఇంటేక్ వెల్ నుంచి వచ్చే నీరు పూర్తిస్థాయిలో శుద్ధి కావడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ప్లాంట్ వద్ద శాశ్వత (పర్మినెంట్) నీటి పరీక్షల ప్రయోగశాల లేకపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. దీంతో రా వాటర్లో, శుద్ధి చేసిన నీటిలో టర్బిడిటీ ఎంత ఉంది? మట్టి, బురద, సూక్ష్మ కణాల స్థాయి ప్రమాణాల్లో ఉందా? అనే విషయాలను శాస్త్రీయంగా నిర్ధారించే పరిస్థితి లేకపోవడం గమనార్హం.

క్లోరిన్ పైనే అనుమానాలు..
నీటిని మరింత శుభ్రం చేయడానికి ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్ ప్రక్రియలు నిర్వహించాలి. ప్రీ క్లోరిన్ బ్యాక్టీరియాను తగ్గిస్తే, పోస్ట్ క్లోరిన్ మిగిలిన సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. నిపుణుల ప్రకారం నీటి శుద్ధి కేంద్రం వద్ద కనీసం 2 పీపీఎం క్లోరిన్ ఉండాలి. ఓహెచ్ఎస్సార్ ట్యాంకుల నుంచి నీరు విడుదలయ్యే సమయంలో 1 నుంచి 2 పీపీఎం మధ్య ఉండాలి. చివరకు ప్రజల ఇళ్ల వద్ద 0.2 పీపీఎం రెసిడ్యువల్ క్లోరిన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ స్థాయి ఉంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ప్లాంట్ వద్ద ఎంత మోతాదులో క్లోరిన్ కలుపుతున్నారో పరీక్షించే వ్యవస్థ లేదు. దీంతో నేరుగా ఓవర్హెడ్ ట్యాంకుల్లోనే క్లోరిన్ లిక్విడ్ కలుపుతున్నట్టు తెలుస్తోంది. క్లోరిన్ మిశ్రమం సరిగా కలపకపోవడం వల్ల 2 పీపీఎం స్థాయి రావడం లేదని తెలిసింది. కొన్ని చోట్ల ట్యాంకుల వద్ద కేవలం 0.5 పీపీఎం మాత్రమే నమోదవుతోందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో బోరు వాటర్ కూడా కృష్ణా నీళ్లలో కలిపి సప్లై చేయడం జరుగుతోంది. అలాంటప్పుడు క్లోరిన్ ఎంత శాతం ఉందనేది గుర్తించడం కష్టం. ఇళ్లకు నీరు సప్లై చేసినప్పుడు వచ్చే వాసన, బురద, మట్టి కణాలు కనిపించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతుంది.