APB News Exclusive: యాదిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుండా మల్లయ్య మనోడే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన గుండా మల్లయ్యకు (ఆర్యవైశ్య) అవకాశం దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన గుండా మల్లయ్య మూడు దశాబ్దాలుగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్వగ్రామంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రామాలయ నిర్మాణంతో పాటు కనకదుర్గ ఆలయాన్ని నిర్మించగా, షిర్డీ, జహీరాబాద్, శ్రీశైలంలో నిత్యాన్నదాన సత్రాల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు.

దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కలేదనే ప్రచారం జరుగుతున్న వేళ, నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన గుండా మల్లయ్య నియామకం జిల్లావాసుల్లో ఆనందాన్ని నింపింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక వర్గాలకు సుపరిచితుడైన మల్లయ్య సేవా ప్రస్థానానికి ఈ నియామకం గుర్తింపుగా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన గుండా మల్లయ్య నాలుగు దశాబ్దాల క్రితమే నిడమనూరు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. జానారెడ్డితో కలిసి దాదాపు పది గ్రామాల బాధ్యతలు నిర్వహించడంతో పాటు తుమ్మడం గ్రామ వైస్ ప్రెసిడెంట్గా కూడా పని చేశారు. అనంతరం హైదరాబాద్లో స్థిరపడినా స్వగ్రామంతో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎప్పుడూ కొనసాగించారు. రాజకీయాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ మల్లయ్య విశేష కృషి చేశారు.

దిల్సుఖ్ నగర్ సాయిబాబా ట్రస్ట్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి, అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. హైదరాబాద్లోని ఆది శంకరాచార్య పీఠం వైస్ ప్రెసిడెంట్గా, జహీరాబాద్ దత్తగిరి ఆశ్రమం చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. దత్తగిరి గురూజీకి పరమ భక్తుడైన మల్లయ్య, షిర్డిలో 50 గదులతో ‘సాయి మేఘ ధర్మశాల’ను నిర్వహిస్తున్నారు. భక్తులకు అత్యంత తక్కువ ధరలకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు కల్పిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. శ్రీశైలంలో నిత్యాన్నదాన సత్ర నిర్మాణం చేపట్టగా, స్వగ్రామం తుమ్మడంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయం, కనకదుర్గమ్మ ఆలయాలను నిర్మించారు. మల్లయ్య ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కితే బాగుండేదని మిర్యాలగూడెంకు చెందిన ఆయన సన్నిహితులు అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక సేవ, సామాజిక బాధ్యత, ప్రజలతో అనుబంధాన్ని సమానంగా కొనసాగించిన మల్లయ్యకు యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్య త్వం దక్కడం ఆయన సుదీర్ఘ సేవా ప్రస్థానానికి దక్కిన అరుదైన గౌరవంగా స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. భక్తుల సౌకర్యాలే తన తొలి ప్రాధాన్యమని, ముఖ్యంగా అన్నదాన సత్రాలు, యాత్రికులకు అవసరమైన వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం తనవంతు కృషి చేస్తా. “ఈ భూమిపై మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ఉన్నంత కాలం దైవ భక్తితో, భక్తులకు సేవ చేయడమే నా కర్తవ్యం” అని మల్లయ్య పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, వివిధ రంగాల ప్రముఖులతో తనకున్న అనుబంధాన్ని యాదాద్రి అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేస్తా. ఈ అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక  కృతజ్ఞతలు.

Share
Share