APB News Exclusive: నామినేటెడ్ పదవుల పై ఆశావహుల గురి..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడతలో నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం రేపటితో ముగియనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు పదవులు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాల కోసం పలువురు సీనియర్ నేతలతో పాటు కొత్త ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తుండగా, తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు కూడా ప్రభుత్వం వద్ద గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కరుడుగట్టిన నేతలకు తొలి విడతలో పదవులు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. జిల్లా మంత్రులు, పార్టీ సీనియర్లు ఇచ్చిన హామీలతో గత రెండేళ్లుగా ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమవడంతో సీనియర్ నాయకులు తమవంతు ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. ఇప్పుడు అవకాశం చేజారితే ఇకపై నామినేటెడ్ పదవి దక్కడం కష్టమేనని భావిస్తున్న వారు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పదవి సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జిలతో పాటు మంత్రులను వరుసగా కలిసి తమ సేవలను గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నామినేటెడ్ పదవులపై రాజకీయ ఆసక్తి పెరిగింది.

పార్టీ వర్గాల సమాచారం మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కుంభం వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం బుధవారంతో ముగియనుంది. రెండేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో వీరికి మరోసారి అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరున్న పటేల్ రమేష్రెడ్డికి ఈసారి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయనకు అధిష్ఠానం తొలి విడతలోనే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించింది. ప్రస్తుతం ఆయన కూడా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియారిటీ, పార్టీ కోసం చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు, జిల్లా మంత్రుల సిఫార్సులు, అధిష్ఠానం పెద్దలతో ఉన్న అనుబంధాలను ఆధారంగా చేసుకుని ఆశావహులు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి ప్రధాన అనుచరుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య (ఎస్సీ మాదిగ), పెద్దవూర మాజీ జడ్పీటీసీ(ZPTC) కర్నాటి లింగారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్రెడ్డి, యాదాద్రి భువనగిరి జి ల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

కొండేటి మల్లయ్య
కర్నాటి లింగారెడ్డి
చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి

2009 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ టికెట్ను ఆశించిన కొండేటి మల్లయ్యకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో టికెట్ చేజారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని జానారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్పకుండా దక్కుతుందనే ఆశతో మల్లయ్య ఉన్నారు. కోదాడకు చెందిన సీనియర్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి చాలా ఏళ్ల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి వెన్నంటి ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ చైర్మన్గా పనిచేసిన ఆయనకు తొలి విడతలోనే కార్పొరేషన్ పదవి వస్తుందని ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఈసారి మాత్రం ఆయనకు పదవి ఖాయమనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

‘నల్లగొండ టైగర్’గా పేరున్న దుబ్బాక నర్సింహారెడ్డి కూడా జిల్లా మంత్రుల సహకారంతో పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఆయన అప్పటి నుంచి రాష్ట్ర వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గుమ్మల మోహన్రెడ్డి కూడా కార్పొరేషన్ పదవిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నల్లగొండ మేయర్ వంటి అవకాశాలు అందని నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ పదవినే చివరి అవకాశంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నల్లగొండ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి కోమటిరెడ్డి స్వయంగా మోహన్రెడ్డిని పరిచయం చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

జానారెడ్డికి సన్నిహితుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువు పెద్దవూర మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి కూడా కార్పొరేషన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఖాళీ కానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పదవిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు, నకిరేకల్ మాజీ ఎంపీపీ(MPP) భర్త గంగాధర్ రావు (వెలమ), పీసీసీ ఉపాధ్యక్షుడు దైదా రవీందర్ (ఎస్సీ) పేర్లు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల రేసులో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, జిల్లా మంత్రుల సిఫార్సులు, అధిష్ఠానం తుది నిర్ణయాన్ని బట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆశావహుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Share
Share