హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెనుక దాగి ఉన్న అసలు “ఇన్సైడ్ స్టోరీ”ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత చేసిన “కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్కు రూ.1,400 కోట్లు వచ్చాయి” అనే వ్యాఖ్య దేశం ముందుంచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, ఈ తాజా ఉదంతంపై బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పులు చెరిగారు.
కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్ ప్రమాణాలు ఎందుకు కుప్పకూలాయో, మేడిగడ్డ ఎందుకు కృంగిందో, అన్నారం–సుందిళ్ల బ్యారేజీలు ఎందుకు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయో ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు.
కాంట్రాక్టర్లు – బీఆర్ఎస్ కుమ్మక్కే మూలం.. హరీశ్ రావు సమాధానం చెప్పాలి
“మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె స్వయంగా రూ.1,400 కోట్ల వ్యవహారం గురించి మాట్లాడితే… ఆ డబ్బు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? దానికి ప్రతిఫలంగా ఎవరికి లాభం జరిగింది? అనే ప్రశ్నలకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్లతో రాజకీయ నాయకుల ఆర్థిక సంబంధాలే నిర్మాణ నాణ్యతను బలి చేశాయనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి” అని ఉత్తమ్ అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావును నేరుగా లక్ష్యంగా చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు:
రాజకీయ హాస్యాస్పదం: కాళేశ్వరం నిర్మాణం జరిగినప్పుడు నీటిపారుదల మంత్రిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు మూడు నెలల్లో ప్రాజెక్టును బాగు చేస్తానని చెప్పడం రాజకీయ హాస్యాస్పదం. నిర్మాణం జరిగినప్పుడు బాధ్యత మీదే… ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌పై నిందలు వేయడం ప్రజలు నమ్మరు.
బాధ్యతారాహిత్యమైన డిమాండ్లు: “పంపులు వెంటనే ఆన్ చేయండి… నీళ్లు నిల్వ చేయండి” అంటూ హరీశ్ రావు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి. పునాదులే అనుమానాస్పదంగా ఉన్న బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టమంటారా?
ఎన్డీఎస్ఏ (NDSA) అనుమతి లేకుండా నీటి నిల్వలు అసంభవం
కాళేశ్వరం సంక్షోభం కేవలం మేడిగడ్డకే పరిమితం కాదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పునాదులు, కట్ఆఫ్ వాల్లు, రాఫ్ట్, సీపేజ్, ఖాళీలు, నిర్మాణ లోపాలు బయటపడటం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
డ్యామ్ సేఫ్టీ రూల్స్ – ప్రభుత్వ విధానం:
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారితీ (NDSA) మూడు బ్యారేజీల పునాదులపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి పరీక్షలు, రీడిజైన్, శాస్త్రీయ పునరావాసం పూర్తయ్యే వరకు నీటిని నిల్వ చేయరాదని స్పష్టంగా సూచించింది. పార్లమెంట్ చట్టంతో ఏర్పడిన ఎన్డీఎస్ఏ సూచనలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరించే ప్రసక్తే లేదు. నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే నీటి నిల్వలు, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
రూ.1.81 లక్షల కోట్ల అప్పుల వారసత్వం..
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అసలు డీపీఆర్‌లో పేర్కొన్న ప్రదేశాల నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించడం కూడా తీవ్రమైన సాంకేతిక విరుద్ధమని, ఆ మార్పులకు ఇప్పటికీ సరైన సమాధానం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. “ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించలేదు… బీఆర్ఎస్ వదిలిన ప్రమాదకర వారసత్వాన్ని మేము స్వీకరించాం. మరో మేడిగడ్డ తరహా ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కారణం కాదు. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే సంస్కృతి మాది కాదు. శాస్త్రీయ పరీక్షలు, నిపుణుల ఆమోదం, జాతీయ భద్రతా ప్రమాణాలు పూర్తయిన తర్వాతే కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తాం. ప్రజల ప్రాణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు” అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.