- తుంగతుర్తి కాంగ్రెస్‌లో హీట్..
- ఎంపీ కిరణ్ కు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ కౌంటర్
- ఆ తొమ్మిది మండల అధ్యక్షుల మార్పు లేదు..
- సామెల్ ఎవరికీ తలవంచడు
సూర్యాపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న మండల అధ్యక్షుల నియామకాల వివాదానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూల్ (సామేలు) చెక్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలోని మండల కమిటీల మార్పుపై వస్తున్న పుకార్లను ఆయన తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ (TPCC) అధిష్ఠానం ప్రకటించిన కమిటీలే ఫైనల్ అని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
“మందుల సామేలు ఎవ్వరికీ తలవంచడు.. నేను ఇక్కడ ఉన్నంతవరకు కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షుల మార్పు అనేది ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే శ్రేణులకు గట్టి భరోసా ఇచ్చారు.
టీపీసీసీ చీఫ్ ఇచ్చిన లిస్టే ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు నూతన అధ్యక్షులను నియమించడం జరిగింది. అయితే, ఈ నియామకాలపై నియోజకవర్గంలోని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కమిటీలు మారుతాయంటూ ప్రచారం సాగించారు.
ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ కీలక వ్యాఖ్యలు చేశారు:
మార్పులు అసలుండవు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల అధ్యక్ష నియామకాల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన వారే పదవుల్లో కొనసాగుతారు.
సమన్వయమే ముఖ్యం: పార్టీలో కొత్త, పాత అనే తేడాలు ఎవరికీ లేవు. సీనియర్లను, కొత్తగా వచ్చిన వారిని అందరినీ సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి.
వివాదాలకు తావులేదు.. క్యాడర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు లేదా అంతర్గత విభేదాలకు తావిచ్చే ప్రసక్తే లేదని, అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రతీ కార్యకర్త గౌరవించాల్సిందేనని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పారు.
ఎమ్మెల్యే మందుల సామేలు శైలి – పొలిటికల్ పంచ్:
“తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నాపై నమ్మకంతో గెలిపించారు. గ్రూపు తగాదాలతో పార్టీకి నష్టం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. మందుల సామేలు ఎవ్వరికీ తల వంచడు. నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నంతవరకు కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షుల మార్పు అనేది జరగదు. ప్రచారం నమ్మి ఎవరూ గందరగోళానికి గురికావద్దు.” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ తొమ్మిది మండలాల అధ్యక్షులు ఇకపై అధికారికంగా తమ పరిధుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అసమ్మతి శ్రేణులు కూడా అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవనే సంకేతాలను ఈ ప్రసంగం ద్వారా ఎమ్మెల్యే పంపినట్లయింది.