APB News Exclusive: ఎపిసోడ్ -1: మంత్రి నిధులు మట్టిపాలు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ప్రజల అవసరాల కోసం కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మట్టి పాలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన కార్పొరేషన్ అధికారులు, జనావాసాలు కూడా లేని రియల్ ఎస్టేట్ వెంచర్లకు సిమెంట్ రోడ్లు వేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో రూ.80 కోట్ల మేర సిమెంట్ రోడ్ల పనులు మంజూరయ్యాయి. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రహదారుల కల్పన లక్ష్యంగా వచ్చిన ఈ నిధులు ప్రస్తుతం కొందరు రియల్టర్లకు వరంగా మారాయన్న చర్చ నల్లగొండలో జోరుగా సాగుతోంది.

మొత్తం 48 డివిజన్ల పరిధిలో 80 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన సీసీ రోడ్లలో ఇప్పటికే 18 కోట్ల విలువైన సుమారు 20 కిలోమీటర్ల రోడ్ల వర్క్స్ పూర్తియ్యాయి. అయితే ప్రజలు ఎక్కువగా నివసించే కాలనీలు, దెబ్బతిన్న ప్రధాన వీధులు పక్కనపెట్టి జనావాసాలు కూడా సరిగా లేని కొత్త లేఅవుట్లు, భవిష్యత్ వెంచర్ల ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే 30 ఫీట్ల వెడల్పు ఉన్న బజార్లలో కూడా కేవలం 12 నుంచి 13 ఫీట్ల వెడల్పుతోనే సీసీ రోడ్లు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నాణ్యత, అంచనాలు, బిల్లుల చెల్లింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం 20 మీటర్ల వెడల్పుతో పనులు చేయాల్సి ఉండగా రోడ్లను కుదించి నిర్మాణాలు చేపట్టడం పైన విమర్శలు వస్తున్నాయి.

రాక్ హిల్స్ కాలనీలో జనావాసాలు లేని ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు
రాక్ హిల్స్ కాలనీలో జనావాసాలు లేని ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు

మున్సిపాలిటీకి ఇంటి పన్ను, ఇతర రూపాల్లో కనీసం నయా పైసా ఆదాయం కూడా రాని ప్రాంతాల్లో కోట్ల రూపాయల పనులు చేపట్టడం వెనుక భారీ స్థాయి లాబీయింగ్ జరిగిందన్న ప్రచారం సాగుతోంది. ప్రజా అవసరాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు అధికారులపై వెల్లువెత్తుతున్నాయి. దీంతో నల్లగొండ నగరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కోమటిరెడ్డి లక్ష్యాన్ని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కలసి నీరు గారుస్తున్నారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. పనుల ఎంపిక నుంచి అమలు వరకు పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకే పనులు చేస్తున్నామని, వేసిన రోడ్ల కిందినుంచి కేబుల్స్, డ్రైనేజీ పైప్ లైన్స్ వేయాల్సి వస్తదని, దాంతోనే 12,13 ఫీట్లతోనే రోడ్లు వేస్తున్నామని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాక్ హిల్స్ కాలనీలో 12 ఫీట్ల వెడల్పుతో నిర్మించిన రోడ్లు

నల్లగొండ పట్టణంలో ఎప్పుడో 2008-09లో వేసిన కేంద్రం నిధులతో నిర్మించిన అండర్ గ్రౌండ్, సిమెంట్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా డివిజన్లలో రోడ్ల ఆనవాళ్లు, డ్రైనేజీలు లీకేజీ అవుతున్నాయి. గత కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారులు, కాంట్రాక్టర్ల వైఖరి చూస్తుంటే మాత్రం శివారు ప్రాంతాల పేరుతో అసలు జనసంచారం లేని ఏరియాల్లో రోడ్లు వేయడం వల్ల ప్రయోజనం ఎవరికి అనేది అంతుచిక్కడం లేదు. ఇంత పెద్ద టౌన్లో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, చెల్లిస్తున్న డివిజన్లను పక్కన పెట్టి కేవలం రియల్టర్ల ప్రయోజనం కోసం శివారు ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జనాలు ఉన్న చోట్ల రోడ్ల నిర్మాణాల్లో తేడాలు వస్తే తిరగబడ్తారని, అదే జన సంచారం లేని చోట్ల రోడ్లు వేయడం వల్ల అటు కాంట్రాక్టర్ కు, ఇటు రియల్టర్లతో ప్రయోజనం పొంద వచ్చన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.

Share
Share