- కామన్ పాయింట్ను వదిలి ప్యాచ్ల వారీగా లైనింగ్ పనులు..
- నీరు లేని ప్రాంతాలకే పరిమితమైన కాంట్రాక్టర్
- సులభంగా పూర్తయ్యే సెక్షన్లకే ప్రాధాన్యం..
- లోతైన, క్లిష్ట ప్రాంతాల పనులు పెండింగ్లోనే
- పనుల క్రమాన్ని మార్చేసిన అధికారులు..
- అసలు స్టార్టింగ్ పాయింట్ను వదిలి కనగల్ నుంచి ప్రారంభం
- రూ.349 కోట్ల పనుల్లో ప్యాచ్ల విధానం..
- ప్రాజెక్టు ప్రణాళికపై తలెత్తుతున్న ప్రశ్నలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఎలిమినేటి మాదవ రెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ (AMRP) లైనింగ్ పనులు ప్రణాళిక ప్రకారం కాకుండా, అవకాశం ఉన్న చోట్ల ప్యాచ్ల వారీగా సాగుతున్నాయి. అసలు కామన్ పాయింట్ నుంచి ప్రారంభించాల్సిన పనులు కనగల్ మండలం కురంపల్లి నుంచి మొదలు పెట్టడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. నీటి ప్రవాహం లేని సులభంగా పూర్తిచేయగల ప్రాంతాల్లోనే ముందుగా పనులు చేస్తుండగా, లోతైన ప్రాంతాలు, నిరంతరం నీటి ప్రవాహం ఉండే సెక్షన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో పనుల క్రమం, నాణ్యత ప్రాజెక్టు లక్ష్యాల పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కామన్ పాయింట్ వదిలేసి..
ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు ప్రస్తుతం ప్రాజెక్టు రూపకల్పన ప్రకారం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా సాగుతున్నాయి. అసలు 23వ కిలోమీటరు (అంగడిపేట) వద్ద ఉన్న కామన్ పాయింట్ నుంచి పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కనగల్ మండలం కురంపల్లి నుంచి పనులు మొదలు పెట్టారు. మధ్యలో మళ్లీ గుడ్లపల్లి వద్ద గేట్లు మూసేసి, నల్లగొండ ఐటీ టవర్స్ నుంచి లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం ఉండటంతో పాటు పనులు వేగంగా పూర్తియ్యే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తున్నప్పటికీ దీని వెనక రాజకీయ వ్యూహాం కూడా ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. మెయిన్ కెనాల్లో ఎక్కడ పనిచేసినా ఒకరకమైన కాంక్రీటు, ఒకే నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా.. ప్రస్తుతం ప్యాచ్ల వారీగా రెండొందలు, మూడొందలు, నాలుగొందల మీటర్ల చొప్పున పనులు కొనసాగుతున్నాయి. లోతైన ప్రాంతాల్లో మట్టి తవ్వకం, సబ్ గ్రేడింగ్ వంటి పనులు ఎక్కువ సమయం తీసుకుంటదని, దాంతోనే అవకాశం ఉన్న చోట పనులు చేస్తున్నామని అధికారులు అంటున్నారు.
రాజకీయ వ్యూహంలో భాగమేనా…?
ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 136 కిలోమీటర్లు. ఇందులో హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు తరలించే అంగడిపేట కామన్ పాయింట్ (23వ కిలోమీటరు) నుంచి నకిరేకల్ నియోజకవర్గంలోని ఓగోడు (మూసీ)వరకు సుమారు 113 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వకు లైనింగ్ చేపట్టనున్నారు. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు మాత్రం ప్రాజెక్టు ప్రణాళిక కంటే రాజకీయ ప్రాధాన్యాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనే చర్చకు దారితీస్తోంది. ప్రాజెక్టు ప్రాధాన్య క్రమం ప్రకారం కామన్ పాయింట్ పరిసరాల నుంచి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం కనగల్ మండలం కురంపల్లి ప్రాంతంపైనే అధికారులు దృష్టి కేంద్రీకరించారు. గుర్రంపోడు డివిజన్ పరిధిలోని రామచంద్రాపురం నుంచి ఉదయ సముద్రం వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర లైనింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అక్కడ ఇప్పటికీ సెక్షన్ పనులకే పరిమితమయ్యారు. మరోవైపు కురంపల్లి–ఐటీ టవర్స్–ఉదయసముద్రం మధ్య సుమారు 20 కిలోమీటర్ల విభాగంలో మాత్రం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం నల్లగొండ నియోజకవర్గ పరిధిలో ఉండటం, అదే సమయంలో కామన్ పాయింట్ను పక్కనపెట్టి డిస్ట్రిబ్యూటరీలు, వ్యవసాయ భూములు పెద్దగా లేని ప్రాంతాల్లో ముందుగా లైనింగ్ చేపట్టడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కామన్ పాయింట్ను వదిలేయడం వెనక కారణమేంటి..?
కామన్ పాయింట్ (అంగడిపేట–23వ కిలోమీటరు)ను పూర్తిగా పక్కనపెట్టి ఇతర ప్రాంతాల్లో పనులు ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామన్ పాయింట్ వద్ద హైదరాబాద్ వాటర్వర్క్స్కు తాగునీటి సరఫరా నిరతరం కొనసాగుతుండటంతో అక్కడ పనులు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్న తీరు సాగునీటి వర్గాల్లో పలు సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్లో అత్యధిక భాగం దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఉంది. ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు, విస్తారమైన సాగుభూములు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కామన్ పాయింట్ వద్ద నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా, దానిని దశలవారీగా నియంత్రిస్తూ పనులు చేపట్టే అవకాశాలను ఎందుకు పరిశీలించలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును అమలు చేస్తున్న సంస్థకు ఇలాంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు నాలుగైదేళ్ల గడువు ఉండగా, ప్రాజెక్టు ప్రారంభ బిందువైన 23 వ కిలోమీటరు నుంచి కాకుండా, 58వ కిలోమీటరు పరిధిలోని కనగల్–కురంపల్లి ప్రాంతం నుంచి పనులు ప్రారంభించడం వెనక ఉన్న కారణాలు అధికారులకే తెలియాలి.
ఇద్దరు ఎమ్మెల్యేలు మౌనమేలా..?
ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ప్రారంభం కావాల్సి ఉన్నా, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో సాగుతున్నాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బాలూ నాయక్, కుందూరు జైవీర్ రెడ్డి స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో, సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసినా, క్షేత్రస్థాయిలో పనులు ప్రణాళిక ప్రకారం సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాలకు చెందిన కీలక పనుల విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.