Breaking News:నల్లగొండలో ఘోరం.. కన్నకొడుకును సుత్తితో కొట్టి చంపిన తండ్రి..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణ పరిధిలో కన్నప్రేమను మంటగలిపే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ, ఓ తండ్రి తన 13 ఏళ్ల కుమారుడిని సుత్తితో తలపై కొట్టి అతి కిరాతకంగా చంపేశాడు. ఆపై కుమారుడి మృతదేహం పక్కనే తానూ విషం తాగి తనువు చాలించాడు.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు (Devarakonda Road) పరిధిలో గల కనకదుర్గ కాలనీలో పబ్బతి లింగారెడ్డి (45) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

భార్య లేని సమయం చూసి: లింగారెడ్డి భార్య ఒక ముఖ్యమైన పని నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) కు వెళ్ళింది. ఇంట్లో భార్య లేని సమయాన్ని చూసుకున్న లింగారెడ్డి.. తన 13 ఏళ్ల కుమారుడు పబ్బతి ప్రణీత్ రెడ్డి (13) పై సుత్తితో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు ప్రణీత్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తండ్రి ఆత్మహత్య: కొడుకును చంపిన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన లింగారెడ్డి, ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంట్లో నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడం, అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ వన్టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలుకొట్టి చూడగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ శవాలై పడి ఉన్నారు. పోలీసులు క్లూస్ టీమ్ను రంగంలోకి దించి ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో అసలు ఏం జరిగింది? ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా? లింగారెడ్డి ఈ స్థాయి ఘాతుకానికి పాల్పడటానికి గల అసలు కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ వెళ్లిన భార్య తిరిగి వచ్చి చూసేసరికి భర్త, కొడుకు ఇద్దరూ శవాలుగా మారడంతో ఆమె ఆక్రందనలు మిన్నంటాయి.

Share
Share