బాల్య స్నేహితుడితో వివాహేతర సంబంధం.. కన్నకూతురినే చంపిన తల్లి..

బెంగళూరు, ఏపీబీ న్యూస్: ప్రియుడి మోహంలో పడి ఓ కన్నతల్లి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆరేళ్ల కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘోర కలియుగ ఉదంతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ల్యాబ్ రిపోర్టులను తారుమారు చేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, భర్తకు వచ్చిన అనుమానంతో ఈ దారుణ హత్య ఉదంతం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కాడుగోడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడు మోహన్ పరిచయమయ్యాడు. అది కాస్తా గత రెండేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన భర్త ప్రవీణ్ ఆమెను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు మందలించాడు. దీంతో ప్రియాంక తన 15 ఏళ్ల కుమారుడిని భర్త వద్దే వదిలేసి, ఆరేళ్ల కుమార్తెను తీసుకుని ప్రియుడు మోహన్తో కలిసి వెళ్ళిపోయి సహజీవనం (Live-in Relationship) ప్రారంభించింది.

మూడు నెలల క్రితం ప్రియాంక అకస్మాత్తుగా భర్త ప్రవీణ్కు ఫోన్ చేసి, కుమార్తె అనారోగ్యంతో మరణించిందని చెప్పింది. ఆహారం వికటించడం (Food Poisoning) వల్లే పాప చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన పోస్ట్మార్టం నివేదికను అతనికి అప్పగించింది. కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రవీణ్, ఆ నివేదికను విదేశాల్లో ఉంటున్న తన డాక్టర్ స్నేహితుడికి పంపించి పరిశీలించాల్సిందిగా కోరాడు.

ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన విదేశీ వైద్యుడు ప్రవీణ్కు సంచలన నిజాలు చెప్పాడు. ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టులో అనేక తప్పులు ఉన్నాయని, పాప ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదని, శ్వాస ఆడకుండా చేసి (హత్య) దాన్ని తప్పుడు నివేదికగా మార్చారని స్పష్టం చేశాడు. దీంతో షాక్కు గురైన ప్రవీణ్ వెంటనే కాడుగోడి పోలీస్ స్టేషన్లో భార్య, ఆమె ప్రియుడిపై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు మోహన్ను అదుపులోకి తీసుకోగా, నిందితురాలు ప్రియాంక పరారైంది. అలాగే తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share
Share