- విద్యుత్ రంగంలో టెలికాం మోడల్..
- ఒకే లైన్‌పై ప్రైవేట్ కంపెనీల కరెంట్ సరఫరాకు కేంద్రం ప్రణాళికలు!
- డిస్కం వ్యవస్థను వాడుకుంటూ ‘వీలింగ్ ఛార్జీలు’ చెల్లించేలా కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదనలు..
- బిల్లుల భారం పెరిగి, ఉద్యోగాలు పోతాయంటూ డిస్కం సిబ్బంది, ప్రతిపక్షాల ఆందోళన!
న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దేశీయ విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన, అదే సమయంలో తీవ్ర వివాదాస్పదమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను ప్రైవేటీకరించేందుకు, వినియోగదారులకు మొబైల్ నెట్వర్క్ల మాదిరిగా నచ్చిన కరెంట్ సంస్థను ఎంచుకునే అవకాశాన్ని (టెలికాం విధానం) కల్పించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి, అన్ని రాష్ట్రాలు ఈ నయా వ్యవస్థను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఒకే లైన్‌పై ఇతర కంపెనీల పోటీ – సబ్స్టేషన్లు అక్కర్లేదు!
కేంద్రం తెస్తున్న ఈ నూతన విధానం ప్రకారం ప్రైవేట్ సంస్థలు కొత్తగా సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు లేదా వైర్ల లైన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ డిస్కంలు (DISCOMs) ఏళ్ల తరబడి శ్రమించి నిర్మించిన మౌలిక వసతులు, కరెంట్ లైన్లను వినియోగించుకునేందుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతినిస్తారు. ఇందుకోసం సదరు ప్రైవేట్ కంపెనీలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) నిర్ధారించిన ‘వీలింగ్ ఛార్జీలు’ (Wheeling Charges) డిస్కంలకు చెల్లించి కరెంట్ పంపిణీకి లైసెన్స్ పొందుతాయి.
కేంద్రం ప్రతిపాదనలు – ఉత్పన్నమవుతున్న ఆందోళనలు:
టెలికాం మోడల్ అమలు: వినియోగదారులు జియో, ఎయిర్టెల్ ఎంచుకున్నట్లుగానే తమకు ఇష్టమైన ప్రైవేట్ కరెంట్ కంపెనీని ఎంచుకోవచ్చు.
డిస్కం నెట్వర్క్ వినియోగం: ప్రైవేట్ కంపెనీలు కొత్తగా ఏ లైన్ వేయకుండా డిస్కంల లైన్లను వాడుకుని ఈఆర్సీ సూచించిన వీలింగ్ ఛార్జీలు ఇస్తాయి.
ధరల బాదుడు భయం: ప్రైవేట్ సంస్థలు కేవలం నామమాత్రపు వీలింగ్ ఛార్జీలు చెల్లించి, వినియోగదారుల వద్ద ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తాయనే ఆరోపణలు.
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన: డిస్కంలు నష్టాల్లోకి వెళ్లి ప్రైవేట్ మయం అయితే తమ ఉద్యోగాలు, పెన్షన్లు ప్రమాదంలో పడతాయని ఉద్యోగ సంఘాలు ధర్నాలకు సిద్ధమవుతున్నాయి.
చెర్రీ పికింగ్ ప్రమాదం – ప్రైవేట్ దందాపై హెచ్చరికలు
ఈ నిర్ణయంపై విద్యుత్ రంగానికి చెందిన నిపుణులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభాలు ఎక్కువగా వచ్చే పరిశ్రమలు, కమర్షియల్ విభాగాలు, పట్టణ ధనిక ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని (Cherry Picking) విద్యుత్ విక్రయిస్తాయని విమర్శిస్తున్నారు. దీనివల్ల ఆదాయం ఇచ్చే కస్టమర్లు ప్రైవేట్ వైపు వెళ్ళిపోయి, సబ్సిడీపై నడిచే వ్యవసాయం, పేదల ఇళ్ల విద్యుత్ భారం మొత్తం ప్రభుత్వ డిస్కంలపైనే పడుతుందని, ఇది డిస్కంలను పూర్తిగా కోలుకోలేని దెబ్బతీస్తుందని విద్యుత్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు
మరోవైపు విద్యుత్ రంగం క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే తమ ప్రభుత్వ ఉద్యోగ భద్రత, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిస్కంలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే వేతనాలు, పెన్షన్ల చెల్లింపు కష్టమవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.