Breaking News: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఖాకీల చేతివాటం..

కరీంనగర్, ఏపీబీ న్యూస్: శాఖకే తీవ్ర మచ్చ తెచ్చేలా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీల పేరుతో దందా నడుపుతున్న కరీంనగర్ పోలీసుల భాగోతం బయటపడింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ అసలు నిందితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ, కోర్టులో వారి స్థానంలో ఇతరులను ‘డమ్మీ నిందితులుగా’ హాజరుపరుస్తున్న అక్రమార్కుల గుట్టును ఉన్నతాధికారులు రట్టు చేశారు. ఈ ఘోర అక్రమాలకు పాల్పడిన ఆర్ఎస్ఐతో (RSI) పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు శిక్షలు, జరిమానాలు పడకుండా తప్పించేందుకు కొందరు పోలీసులు ఏకంగా ఓ సిండికేట్గా మారారు. దాదాపు 130 కేసుల్లో అసలు నిందితుల నుంచి రూ. 20 లక్షల వరకు దండుకున్నట్లు విచారణలో తేలింది. డబ్బులు ఇచ్చిన నిందితులను తప్పించి, వారికి బదులుగా డబ్బులకు కక్కుర్తి పడే ఇతర వ్యక్తులను నిందితుల స్థానంలో కోర్టుల ముందు నిలబెట్టి కేసులు ముగించేవారని అధికారులు గుర్తించారు.

సిండికేట్ దందా: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలు.

డమ్మీ నిందితులు: అసలు నిందితులకు బదులుగా కోర్టులో వేరొకరిని హాజరుపరిచిన వైనం.

వసూళ్ల పర్వం: 130 కేసుల్లో రూ.20 లక్షలకు పైగా అక్రమ అర్జన.

కఠిన చర్యలు: బాధ్యుడైన ఆర్ఎస్ఐ శ్రీకాంత్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన అధికారులు.

ఈ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇటువంటి దందాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Share
Share