APB News Exclusive: యాదాద్రి పై రేవంత్‌ ముద్ర..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం టెంపుల్ బోర్డు ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకోవడంతో అధికార పార్టీలో పదవుల కోసం పోటీ తీవ్రంగా మారింది. చైర్మన్తో పాటు డైరెక్టర్ పోస్టుల కోసం పలువురు నేతలు, ఆశావాహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల ద్వారా లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి టెంపుల్ బోర్డు అంటే రాజకీయంగా, ఆర్థికంగా, ప్రతిష్టాత్మకంగా కీలకమైన వ్యవస్థ కావడంతో పదవుల కోసం పోటీ ఊహించని స్థాయికి చేరింది. కొందరు ఆశావాహులు హైదరాబాద్లో పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు యాదాద్రిలో స్వామివారి దర్శనాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమకు అవకాశం రావాలని కోరుకుంటున్నారు. “పదవి కోసం నేతల ప్రదక్షిణలతో పాటు స్వామివారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలే” అన్న చర్చ అధికార పార్టీలో వినిపిస్తోంది.

అయితే ఈసారి బోర్డు నియామకాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టితో వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న ఆశావహులకు పాలకమండలిలో ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆధ్యాత్మికత, సేవాభావం ఉన్న వ్యక్తులకే పెద్దపీట వేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చైర్మన్ పదవిని రాజకీయేతర, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన వ్యక్తికి ఇవ్వాలన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటే పాలకమండలి సభ్యులను సైతం రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులనే నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట పాలకమండలిని రూపొందించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. కేవలం రాజకీయ సమీకరణాలకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక భావాలు, సేవా కార్యక్రమాల్లో అనుభవం, దేవాలయ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తులను బోర్డులోకి తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వం వద్ద ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే పాలకమండలి కూర్పు పైన సీఎం రేవంత్ ముద్ర కనిపించే విధంగా బోర్డు నియామకాలు ఉండొచ్చనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ మేరకు యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలకు ఇప్పటికే సంకేతాలు అందాయి. ఈ నెలాఖరున సీఎం యాదాద్రి జిల్లా పర్యటన ఉందని, దీనిలో భాగంగా పాలకమండలి పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. టెంపుల్ బోర్డు కూర్పు పై సీఎం రేవంత్ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డితో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారని చెప్తున్నారు. చైర్మన్తో పాటు డైరెక్టర్ల ఎంపికలో ప్రాంతీయ సమీకరణాలు, ఆధ్యాత్మిక సేవా నేపథ్యం, రాజకీయ సమతౌల్యం పై అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం పాలకమండలికి తుది రూపు ఇవ్వనున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

రాజకీయాలకు అతీతంగా బోర్డు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో టెంపుల్ చైర్మన్, డైరక్టర్లు పదవి ఆశిస్తున్న రూలింగ్ పార్టీ లీడర్ల ఆశల పైన నీళ్లు చల్లినట్టే. ఇప్పటికే కొందరు నేతలు తమకు పదవులు ఖాయమనే అంచనాల్లో ఉండగా, సీఎం ఆలోచనలు వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యాదాద్రి, నల్లగొండ జిల్లాలో ప్రముఖ హోటల్ యజమాని సాది వెంకటరెడ్డి పేరు మొదట్లో వినిపించింది. మంత్రి వెంకటరెడ్డి పలువురికి బోర్డులో చోటు కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య అనుచరులు కూడా రేసులో ఉన్నారు. కానీ, ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఆధ్మాతికంగా సేవలు అందించే ప్రముఖులకు మాత్రమే బోర్డు బాధ్యతలు అప్పగిస్తారని చెప్తున్నారు. టీటీడీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రముఖులకు పాలకమండలిలో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. అంతిమంగా యాదాద్రి టెంపుల్ పైన రాజకీయ మచ్చ కనబడకుండా దేవస్థానం అభివృద్ధి, విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించేలా పాలకమండలి నియామకం ఉంటదని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

Share
Share