Breaking News: ‘మొగోనివైతే సొంత పార్టీపై పోటీ చేయ్’.. తీన్మార్ మల్లన్నపై విప్ బీర్ల ఐలయ్య ఘాటు వ్యాఖ్యలు..

ఆలేరు / నల్గొండ, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అత్యంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీల సంక్షేమం ముసుగులో సొంత కాంగ్రెస్ పార్టీపై, బీసీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న తీన్మార్ మల్లన్న నడ్డి విరవడం ఖాయమని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి-ఫామ్ తీసుకుని, పార్టీ ఇచ్చే భిక్షతో గెలిచి ఇవాళ సొంత ప్రభుత్వంపైనే నిందలు వేయడం సబబు కాదని ధ్వజమెత్తారు.

దమ్ముంటే నల్లగొండ, మునుగోడులో పోటీ చెయ్: “మల్లన్న నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నల్లగొండ, మునుగోడు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టి మాట్లాడు. మగాడివైతే నీ సొంత పార్టీ బీ-ఫామ్ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలువు” అని సవాల్ విసిరారు.

ఆలేరు సవాల్: ఆలేరు నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేసి కనీసం డిపాజిట్ తెచ్చుకుంటే.. తాను ఇకపై ఆలేరు నుంచి పోటీ చేయనని సూటిగా సవాల్ చేశారు.

బీసీ ద్రోహి మల్లన్న: బీసీ ముసుగులో ఉంటూ బీసీ బిడ్డలనే అణగదొక్కే కుట్రలు చేస్తున్నావని, నీ అసలు రంగు త్వరలోనే రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడుతుందని విమర్శించారు. బీసీ బిడ్డలపై నీకున్న బలుపు, అహంకారపు మాటలను జనాలు గమనిస్తున్నారని అన్నారు.

సంస్కారం లేని వైఖరి: ఎదుటి కులాలను, స్వంత పార్టీ నాయకులను నిందించే సంస్కారహీనమైన వ్యక్తిత్వం మల్లన్నది అని మండిపడ్డారు. పేరు, ఊరు, పార్టీలను అవసరాన్ని బట్టి మార్చుకోవడం అతనికి అలవాటేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపుతుండగా, బీర్ల ఐలయ్య చేసిన ఈ సంచలన సవాల్తో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Share
Share