APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు లేకపోయినా, వందల సంఖ్యలో వాహనాలు ఉన్నట్టు కాగితాలపై చూపించి వడ్ల రవాణా టెండర్లు దక్కించుకున్నారు. ఒకే లారీ నంబర్లను పలుమార్లు వినియోగించడం, ఇతర ప్రాంతాల వాహనాలను తమవిగా చూపించడం, కొన్ని వాహనాల ఆర్సీ(RC)లు జతచేసి భారీ సామర్థ్యం ఉన్నట్టు చూపించి టెండర్ ప్రక్రియను మలుపుతిప్పిన బాగోతం బయట పడింది. వడ్ల సీజన్ మొదలైనప్పటి నుంచే లారీల గొడవ రచ్చకెక్కింది. కాగితాల పైన 820 లారీలు ఉన్నట్టు చూపిస్తున్నా ఫీల్డ్లో లారీలు కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. ఐకేపీ(IKP), పీఏసీఎస్(PACS) సెంటర్ల నిర్వహకులు లారీలు రావట్లేదని, దాంతో వడ్ల రవాణా ఆలస్యమవుతోందని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పటికే 60 శాతం కొనుగోళ్లు పూర్తియిన్పటికీ ఇంకా లారీల కొరత తీర్చకపోవడం టెండర్ల కమిటీ పనితీరును తేటతెల్లం చేస్తోంది.

నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, కట్టంగూరు, దేవరకొండ, హాలియా, కనగల్, నిడమనూరు, తిప్పర్తి, మిర్యాలగూడెం క్లస్టర్ పరిధిలో 459 కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను మిల్లులకు తరలించేందుకు ఎల్ 1 కాంట్రాక్టర్లను జిల్లా టెండర్ల కమిటీ ఏప్రిల్ లో ఎంపిక చేసింది. ఈ జాబితాను స్టేట్ సివిల్ సప్లై కార్పోరేషన్ ఆమోదించింది, కానీ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అసలు ఎన్ని లారీలు ఉన్నాయి? అనేది విచారించలేదు. కాంట్రాక్టర్లు చూపించిన బోగస్ కాగితాలనే పైనే ఆధారపడ్డారు. విశ్వనీయ సమాచారం మేరకు ఒక్కో కాంట్రాక్టర్ వద్ద కనీసం పది లారీలు కూడా లేవని, కానీ వందల సంఖ్యలో లారీలు ఉన్నట్టు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ 10 మంది కాంట్రాక్టర్లలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్ల మీదనే బోగస్ టెండర్లు దాఖలు చేశారు.

820 లారీలు నిజంగానే ఫీల్డ్లో ఉంటే రోజుకు 30 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లులకు ఎగుమతి చేయాలి. కనీసం ఐదారు లారీలు కూడా లేని నకిరేకల్ క్లస్టర్ పరిధిలో 243 లారీలు కేటాయించారు, కానీ ఇక్కడ వడ్లు రవాణా చేస్తున్న లారీలు కేవలం 161 అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ క్లస్టర్ పరిధిలో ఇంకా 63 వేల మెట్రిక్ టన్నుల వడ్లు సెంటర్ల వద్ద పేరుకుపోయాయి. అదేవిధంగా నల్లగొండ క్లస్టర్ కు 252 లారీలు కేటాయించినట్టు చెప్తున్నారు, కానీ ఫీల్డ్లో 113 లారీలే ఉన్నాయి. దీంతో ఇప్పటికీ ఈ క్లస్టర్ పరిధిలో ఇంకా 60 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లులకు తరలించాల్సి ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ క్లస్టర్ పరిధిలో 130 లారీలు అలాట్ చేసినట్టు చెప్తున్నా 67 లారీలే నడుస్తున్నాయి. ఈ క్లస్టర్ పరిధిలో 30 వేల మెట్రిక్ టన్నుల వడ్లు ఎగుమతి చేయాల్సి ఉంది. దేవరకొండలో 45 లారీలకు 42, మిర్యాలగూడలో 75 లారీలకు 24, మునుగోడు క్లస్టర్ పరిధిలో 45 లారీలకు 22 లారీలే నడుస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో 6,76,249 మెట్రిక్ టన్నుల వడ్లు సెంటర్లకు రాగా, ఇప్పటి వరకు 4,50,185 మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇంకా 2,45,746 మెట్రిక్ టన్నుల వడ్లు సెంటర్ల వద్దే ఉన్నాయి.

వడ్లు రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్ సంస్థల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా రవాణా కమీషన్ జమ చేస్తుంది. ఈ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ కాంట్రాక్టర్లు టెండర్లు వచ్చాక ప్రైవేటు లారీలను తెప్పించి వడ్ల రవాణాను సొంత వ్యాపారంగా మార్చారు. కొందరు కాంట్రాక్టర్లు అయితే తమ వాట్సాప్ స్టేటస్లో లారీలు కావాలని పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఇసుక లారీలు, సిమెంట్ లారీల ఓనర్లతో చేతులు కలిపి అప్పటికప్పుడు లారీలను తెప్పిస్తున్నారు తప్పా నిజానికి వందల సంఖ్యలో లారీలు కాంట్రాక్టర్ల వద్ద లేవు. బుధవారం వరకు పరిస్థితిని పరిశీలిస్తే 820 లారీలకు గాను ఫీల్డ్లో 457 లారీలు మాత్రమే తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ అసలు అన్ని లారీలు ఫీల్డ్లో ఉన్నాయా? లేదా? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మిల్లుల వద్ద అన్లోడ్ కాలేదని దాంతోనే లారీల కొరత ఏర్పడిందని అధికారులను మోసం చేస్తున్నారు. మరో గత్యంతరం లేక అధికారులే స్వయంగా లారీల డ్రైవర్లకు ఫోన్ చేసి బతిమిలాడుకునే పరిస్థితిని కాంట్రాక్టర్లు కల్పించారు.

టెండర్ల ప్రక్రియనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలువురు ఉన్న న్నతాధికారులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ జోక్యం చేసుకోవడంతోనే లారీల కొరత తీర్చేందుకు కలెక్టర్లు, ఎస్పీలు రోడ్ల పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి బదులు టెండర్ల ప్రాసెస్ పూర్తిగా మార్చాలనే వాధన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఎల్ 1 కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని లారీ అసోసియేషన్లతో అధికారులు ముందుగానే సంప్రదింపులు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ గురించి వాళ్లతో చర్చించి టెండర్లుకు ఆహ్వానిస్తే పరిస్థితి ఇందాక వచ్చేది కాదని అంటున్నారు. కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడితో అధికారుల పైన ఒత్తిళ్తు తెస్తున్నారని, దాంతో మరోమార్గం లేక లారీలు ఉన్నా లేకున్నా టెండర్లను ఫైనల్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది కూడా లారీల కొరత తీర్చేందుకు అప్పటి కలెక్టర్ రోడ్ల పైన వెళ్తున్న ప్రైవేటు వాహనాలను, ట్రాక్టర్లను సెంటర్ల వైపుకు మళ్లించారు. ట్రాన్స్పోర్ట్ డిపార్మెంట్, రెవిన్యూ ఆఫీసర్లు బృందాలుగా ఏర్పడి రోడ్ల పైన వచ్చిపోయే వాహనాలను ఆపి వడ్ల సెంటర్లకు దారి మళ్లించిన సంఘటనలు ఈ సీజన్లో కూడా రీపీట్ అయ్యే పరిస్థితి వచ్చింది.

Share
Share