Breaking News: పోషించే స్తోమత లేక ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు..

మెదక్, ఏపీబీ న్యూస్: అర్ధాకలితోనైనా కడుపున పుట్టిన బిడ్డను సాదుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాలో జరిగిన ఈ శిశు విక్రయం ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో శిరీష మెదక్ మాతా శిశు కేంద్రంలో నాలుగోసారి కూడా ఆడబిడ్డకే జన్మనిచ్చింది. అప్పటికే ఉన్న ముగ్గురు పిల్లలను పోషించే స్తోమత లేదని భావించిన ఆ దంపతులు, పుట్టిన బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

భారీ బేరం: మధ్యవర్తుల ద్వారా సిద్ధిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులతో రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలోనే శిశువును వారికి అప్పగించి సొమ్ము చేసుకున్నారు.

ప్రసవం ముగిసిన తర్వాత తల్లి శిరీష వద్ద బిడ్డ లేకపోవడాన్ని స్థానిక అంగన్వాడీ సిబ్బంది గమనించారు. బిడ్డ ఏమైందని ఆరా తీయగా దంపతులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు తాండాలో విచారణ జరిపి శిశు విక్రయం జరిగిందని నిర్ధారించారు.

ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. శిశువు తల్లి, కొనుగోలు చేసిన దంపతులు మరియు ఈ డీల్లో సహాయపడిన మధ్యవర్తులతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. శిశువును సురక్షితంగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు.

పిల్లలను పోషించే స్తోమత లేకపోతే ప్రభుత్వ సహాయం కోరాలి లేదా దత్తత నిబంధనల ప్రకారం వ్యవహరించాలి తప్ప, ఇలా సంతలో వస్తువులలా అమ్మడం చట్టరీత్యా నేరం. విద్యావంతులైన మధ్యవర్తులు కూడా ఇలాంటి క్రయవిక్రయాల్లో పాలుపంచుకోవడం సమాజం ఎటు వెళ్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది.

Share
Share