Breaking News: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన పలువురు కీలక నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖకు నోటీసులు: సీఎం రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మూడు రోజుల్లోగా స్పష్టమైన వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.

చిన్నారెడ్డికి నోటీసులు: వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది.

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కులాల పేరుతో పలువురిని తీవ్రంగా దూషించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆయనపై వేటు వేశారు.

గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని టీపీసీసీ నాయకత్వం ఈ చర్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

Share
Share