విశాఖలో విషాదం: టీచర్ కొట్టడంతో భయపడి LKG విద్యార్థి కుప్పకూలి మృతి..

విశాఖపట్నం, ఏపీబీ న్యూస్: విశాఖపట్నంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయురాలి ప్రవర్తనకు భయపడి, గుక్కపెట్టి ఏడుస్తూ ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. స్థానిక లిటిల్ గార్డెన్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ (6) అనే విద్యార్థి హోమ్వర్క్ చేయలేదన్న నెపంతో టీచర్ దండించడంతో తీవ్ర భయాందోళనకు గురై కుప్పకూలిపోయాడు.

చిన్నారికి స్పృహ తప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

హోంవర్క్ వివాదం: ఎల్కేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ హోమ్వర్క్ పూర్తి చేయలేదని ఉపాధ్యాయురాలు దండించారు. టీచర్ ప్రవర్తనకు తీవ్ర భయానికి గురైన చిన్నారి బిగ్గరగా గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించాడు.

టీచర్పైనే కుప్పకూలిన చిన్నారి: ఏడుస్తూనే తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు, చూస్తుండగానే స్పృహతప్పి నేరుగా టీచర్పైనే కుప్పకూలిపోయాడు. పాఠశాల యాజమాన్యం వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి: తరగతి గదిలో జరిగిన ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఉపాధ్యాయురాలు బాలుడిని దండించిన తీరు, ఆ తర్వాత చిన్నారి కుప్పకూలిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి.

సీసీటీవీ దృశ్యాలు చూసి ఆగ్రహంతో రగిలిపోయిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లిటిల్ గార్డెన్ స్కూల్ ఎదుట భారీగా ఆందోళనకు దిగారు. బాలుడి మృతికి కారణమైన ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతికి అసలు కారణం భయంతో కూడిన గుండెపోటా లేక మరేదైనా ఆరోగ్య సమస్య ఉందా అనే కోణంలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Share
Share