APB News Exclusive: తొమ్మిదో తరగతిలో గోవా.. పదో తరగతిలో హత్య!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపా రెడ్డి హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు.. తొమ్మిదో తరగతి నుంచే బీర్లు, సిగరెట్లకు అలవాటుపడటం, తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు దొంగిలించడం, చివరకు ఎవరికీ చెప్పకుండా గోవా ట్రిప్కు వెళ్లడం వంటి విషయాలు విచారణలో బయటపడినట్లు సమాచారం. తల్లిదండ్రులు కాయకష్టం చేసి పిల్లలను ఉన్నతంగా చదివించాలని తాపత్రయపడుతుంటే.. వారి పిల్లలు మాత్రం జల్సాలకు అలవాటుపడి తల్లిదండ్రులనే బెదిరించే స్థాయికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. బైక్ కొనాలనే మోజుతో డబ్బు దొంగతనానికి పాల్పడటం.. ఆ వ్యవహారం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లడంతో ఆమె మందలించడం.. దీంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు చివరకు అదే ప్రిన్సిపల్ను హత్య చేయడం ఈ కేసులో విస్తుపోయే పరిణామంగా మారింది.

హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీరి కుటుంబాలు ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ పిల్లలను మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టపడుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఒక విద్యార్థి కుటుంబం స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా.. మరో విద్యార్థి కుటుంబం హైదరాబాద్లో వాచ్ మెన్, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. పిల్లలను హాస్టల్లో ఉంచి చదివించే స్థోమత లేకపోయినా.. వారి అవసరాలకు తల్లిదండ్రులు తమ శక్తికి మించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులు ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు. ఆ డబ్బుతో జల్సాలకు అలవాటుపడ్డారు. తొమ్మిదో తరగతిలోనే ఎవరికీ చెప్పకుండా గోవా ట్రిప్కు వెళ్లి రావడం అప్పటికే వారి ప్రవర్తన ఏ స్థాయికి చేరిందో చెబుతోందని పోలీసులు పేర్కొంటున్నారు.

తొమ్మిదో తరగతి నుంచే బీర్లు, సిగరెట్లకు అలవాటు పడిన విద్యార్థులు అదే జీవనశైలిని కొనసాగించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హాస్టల్లో కూడా సక్రమంగా ఉండకుండా తరచూ ఇంటివద్దే ఎక్కువ రోజులు గడిపేవారని తెలుస్తోంది. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సందర్భాల్లో పాఠశాల సిబ్బంది మందలించినప్పటికీ.. మార్పు రాలేదని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

రూపారెడ్డి హత్యకు కొద్ది రోజుల ముందు విద్యార్థులు ఇంటి నుంచి సుమారు రూ.9 వేల నగదు దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ డబ్బును పాఠశాలలో లెక్కపెడుతుండగా టీచర్లు గమనించి ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చారు. దీంతో రూపారెడ్డి విద్యార్థులను పిలిచి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించి మందలించారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో గట్టిగా హెచ్చరించారు. ఇదే ఘటన విద్యార్థుల్లో ప్రిన్సిపల్పై కక్షకు కారణమైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

బైక్ కొనాలనే మోజుతో డబ్బు దొంగతనం చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ మందలించడంతో ఆమెపై కక్ష పెరిగింది. అదే సమయంలో రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని వారు భావించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. దీంతో ప్రిన్సిపల్పై కక్షను తీర్చుకోవడంతో పాటు ఆమె వద్ద ఉన్న నగదును దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఆలోచనే చివరకు రూపారెడ్డి హత్యకు దారి తీసింది.

హత్య జరిగినప్పటి నుంచి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేరస్థల ఆధారాలు, సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో పాటు అనుమానితుల కదలికలను పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసుల దృష్టి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్పై పడింది. అయితే ప్రిన్సిపల్ మృతికి సంతాపంగా పాఠశాలకు వరుసగా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులను వెంటనే విచారించే అవకాశం లేకుండా పోయింది. స్కూల్ పునఃప్రారంభమైన వెంటనే పోలీసులు విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు కొద్దిరోజులుగా పాఠశాలకు రావడం లేదని గుర్తించారు.

పోలీసులు పాఠశాల సిబ్బందిని విచారించగా.. ఈ ఇద్దరు విద్యార్థుల ప్రవర్తన, గతంలో జరిగిన డబ్బు వ్యవహారం, ప్రిన్సిపల్ వారిని మందలించిన ఘటన తదితర వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ క్లూస్ ఆధారంగా పోలీసులు విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను సరిపోల్చడంతో అనుమానం మరింత బలపడింది. చివరకు ఇద్దరు విద్యార్థులను అదుపు లోకి తీసుకుని విచారించడంతో ప్రిన్సిపల్ హత్యకు సంబంధించిన అసలు కథ బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన నేపథ్యంలో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలకు అవసరమైన వస్తువులు, డబ్బులు అందించడం మాత్రమే కాకుండా.. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, సెల్ఫోన్లలో ఏం చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ను అనుసరిస్తున్నారు, వారి ఖర్చులు ఎలా ఉన్నాయి అనే విషయాలపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. మైనర్ వయసు లోనే మద్యం, సిగరెట్లు, జల్సాలు, డబ్బు దొంగతనం వంటి అలవాట్లు పెరగడం.. చివరకు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చో రూపారెడ్డి హత్య ఘటన హెచ్చరిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.

Share
Share