‘నల్లగొండను సూపర్‌ స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతాం’: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండ పట్టణాన్ని సమస్యలు లేని నగరంగా, మోడల్ ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, 24 గంటల తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

నల్గొండలో పలు అభివృద్ధి పనుల ప్రణాళికను వెల్లడించిన మంత్రి.. రాత్రింబవళ్లు పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు.

రోడ్లు & రహదారి విస్తరణ: పానుగల్ నుంచి భాస్కర్ థియేటర్ వరకు రూ. 14.45 కోట్లతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

24 గంటల తాగునీరు: పట్టణంలో రూ. 125 కోట్లతో 12 తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, ఇప్పటికే ఒక ట్యాంకు పూర్తయిందని తెలిపారు. డిసెంబర్ నాటికి మిగిలినవి పూర్తి చేసి 24 గంటల మంచినీరు అందిస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డితో చర్చించి తాగునీటి నిమిత్తం ప్రత్యేకంగా రూ. 300 కోట్లు తీసుకువచ్చినట్లు చెప్పారు.

పర్యాటక రంగానికి ఊతం: లతీఫ్సాబ్ గుట్ట, శివాలయం గుట్టల రోడ్ల అభివృద్ధికి రూ. 150 కోట్లు కేటాయించి, ఎక్కడా లేని విధంగా రోప్వేలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ. 150 కోట్లతో పార్కు అభివృద్ధి ప్రతిపాదనలు పంపామని, చర్లపల్లి చెరువు అభివృద్ధికి రూ. 20 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు & మహిళా సాధికారత: నల్గొండ పట్టణానికి 700 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, గొల్లగూడ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. శ్రీనివాస్నగర్ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల ఆధ్వర్యంలో గోదాములు, పెట్రోల్ పంపులు, రూ. 2 కోట్లతో షాపింగ్ మాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.

విద్య, వైద్య రంగాలు: నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ‘ప్రతీక్ ఫౌండేషన్’ సహకారంతో మోడల్ సంస్థలుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share
Share