APB News Exclusive: నల్లగొండలో బీఆర్‌ఎస్‌ ‘త్రిముఖ వ్యూహం’!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న కొత్త వైఖరి చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ను ఎదుర్కొనే క్రమంలో బీఆర్ఎస్ సొంత కార్యాచరణకు బదులు.. బీజేపీ, సీపీఎం చేపడుతున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడం ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. దీంతో నల్లగొండలో బీఆర్ఎస్ ‘త్రిముఖ వ్యూహం’ అమలు చేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు వివిధ ప్రజా సమస్యలపై ఇతర పార్టీలతో కలిసి కదులుతుండటం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలో బీజేపీ నేత నాగం వర్షిత్రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకున్న సమయంలో బీఆర్ఎస్ స్పందించగా.. తాజాగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆందోళనకు కూడా బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

నల్లగొండలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో నష్టపోయిన బాధితుల సమస్యపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి స్పందించిన సందర్భం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఓల్డ్ సిటీలో వినాయకచవితి సందర్భంగా జరిగిన ఘటనలో నాగం వర్షిత్రెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరును భూపాల్రెడ్డి ఖండించడం కూడా అప్పట్లో చర్చకు దారితీసింది. ఇక తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం బీఆర్ఎస్, సీపీఎం మధ్య మరోసారి సమన్వయానికి వేదికగా మారింది. ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, లతీఫ్సాబ్ గుట్టకు బఫర్జోన్ గుర్తించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సీపీఎం నాయకుల అరెస్టును ఖండిస్తూ చేపట్టిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. అంతేగాక సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బీఆర్ఎస్ తన వైఖరిని మరింత స్పష్టంగా చాటిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నల్లగొండలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం మధ్య అవగాహన ఏర్పడినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. మరోవైపు కొన్ని చోట్ల బీజేపీతో పరోక్ష సహకారం ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా.. అప్పట్లో ఏర్పడిన ఈ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో రూపంలో కనిపిస్తున్నాయన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై సొంతంగా ఉద్యమాలు చేపట్టకుండా.. ఇతర పార్టీల ఆందోళనలకు ఎందుకు మద్దతు ఇస్తోంది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై సీపీఎం పోరాటానికి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్.. అదే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమం ఎందుకు చేపట్టలేదన్న చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రతిపక్ష శ్రేణుల్లోనూ వినిపిస్తోంది. నియోజకవర్గంలో స్థానిక సమస్యలు చాలానే ఉన్నాయని, వాటిపై బీఆర్ఎస్ తన పార్టీ శ్రేణులను సమీకరించి ఉద్యమిస్తే రాజకీయంగా మరింత లాభం ఉంటదని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చుట్టూ బీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ కొత్త కూర్పు కూడా ఆసక్తి రేపుతోంది. ఒకవైపు బీజేపీ నేతలకు సంబంధించిన అంశాలపై స్పందించడం.. మరోవైపు సీపీఎం ఆందోళనలకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది తాత్కాలిక అంశాలపై పరస్పర మద్దతు మాత్రమేనా? లేక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రతిపక్ష శక్తుల మధ్య అవగాహన పెంచే వ్యూహమా? అన్నది ఇప్పుడు నల్లగొండ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.

ఇటీవల నల్లగొండ–మర్రిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి త్వరగా ప్రారంభించాలని బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనకు విశేష స్పందన లభించింది. అనంతరం అదే మర్రిగూడ జంక్షన్ వద్ద బాబూ జగ్జీవన్రామ్, అంబేద్కర్ విగ్రహాలను తొలగించే ప్రయత్నం జరిగిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేరుగా రంగంలోకి దిగిన సందర్భాలు ఉన్నప్పటికీ.. ఇతర పార్టీల ఆందోళనలకు వరుసగా మద్దతు ఇవ్వడం మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

నల్లగొండలో ప్రస్తుతం కాంగ్రెస్ బలమైన అధికార పార్టీగా ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎంల మధ్య సమస్యల ఆధారంగా సమన్వయం ఏర్పడితే.. అది భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే ఇది ఎన్నికల పొత్తుకు సంకేతమా? లేక ఆయా సమస్యలపై మాత్రమే పరస్పర మద్దతా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Share
Share