Breaking News: రైఫిల్ పట్టినట్లే రుమాలు చుడతా.. ఎమ్మెల్యే రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: “అధికార పక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా నేను ఎప్పుడూ ప్రజల పక్షమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నా నైజం” అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్వంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అంటానని, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు అని నిలదీస్తానని హెచ్చరించారు.

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ తెలంగాణ ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న ’25 ఏండ్ల పాటల ప్రస్థానం’ పుస్తక ఆవిష్కరణ సభ గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ వచ్చినా మారని పేదల తలరాత: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా పేదలకు ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో గానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో గానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోవడం చూస్తే తీవ్ర బాధ కలుగుతోందన్నారు.

రుమాలు చుట్టి పోరాటానికి సిద్ధం: దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏపూరి సోమన్న లాంటి ప్రజా కళాకారులు గజ్జె కడితే, తాను రుమాలు చుట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం మళ్లీ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

తమిళనాడు తరహా రాజకీయ మార్పు: రాష్ట్ర రాజకీయాలను శాసించే శక్తి, మార్చే ధైర్యం తనకు ఉన్నాయని, తన నిజాయితీనే తనకు కొండంత బలమని చెప్పారు. రానున్న కాలంలో తెలంగాణ రాజకీయాల్లో తమిళనాడు తరహాలో భారీ మార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

వసూలు రాజాలపై ధ్వజమెత్తు: కులం, మతం పేరు చెప్పుకుని పైకెదిగిన తర్వాత కొంతమంది ‘వసూలు రాజాలు’గా మారుతున్నారని, అలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి, గెలిచిన తెల్లారే రూపురేఖలు మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలపై ఆగ్రహం: పేదవాడికి రూ.5 లక్షల ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం 500 రకాల నిబంధనలు పెడుతోందని విమర్శించారు. సగం ఇల్లు కట్టుకున్నాక ఆటో ఉందనో, ట్రాక్టర్ ఉందనో చెప్పి బిల్లులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణ సాధనలో కళాకారుల పాత్ర కీలకమని, వారు చట్టసభల్లో అడుగుపెట్టాలని కాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఏపూరి సోమన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతారని, తాను మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదని హమీ ఇచ్చారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Share
Share