Video: ‘మీకు 60 ఏళ్లకు పదవి ఒకే.. మాకు 30 ఏళ్లకు ఉద్యోగం వద్దొద్దా?’: కోదండరామ్‌కు నిరుద్యోగుల నిరసన సెగ

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై నిరుద్యోగ యువతలో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జన సమితి (TJS) అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు నిరుద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ యువత ఆయనను చుట్టుముట్టి సూటి ప్రశ్నలతో నిలదీశారు.

60 ఏళ్లకు ఎమ్మెల్సీ – 30 ఏళ్లకు ఉద్యోగం లేదా?: “మీరు 60 ఏళ్ల వయస్సులో సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోగలరు కానీ, మేము 30 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి పనికిరామా? వయోపరిమితి పెంపుపై ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తెవడం లేదు?” అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ మాట నమ్మే కాంగ్రెస్కు ఓటేశాం: “శాసనసభ ఎన్నికల్లో మీరు చెప్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాము. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోకపోతుంటే మీరు ఎందుకు మౌనంగా ముసుగు తన్నుకుని కూర్చున్నారు?” అని సూటిగా ప్రశ్నించారు.

మీడియా స్పందనపై నిలదీత: ప్రధాన మీడియా కూడా నిరుద్యోగుల సమస్యలు, వయోపరిమితి పెంపు డిమాండ్లను సరిగ్గా కవర్ చేయడం లేదని, తమ సమస్యలను కవర్ చేయాలని మీడియాకు గట్టిగా చెప్పాలంటూ కోదండరామ్ను డిమాండ్ చేశారు.

ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో నిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ కోదండరామ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. నిరుద్యోగుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

Share
Share