Breaking News: అనవసరంగా కాంగ్రెస్‌లో చేరాను.. రేవంత్‌రెడ్డి, మంత్రులపై పోచారం సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన మంత్రివర్గంపై నిప్పులు చెరిగారు. “అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను” అని సంచలన వ్యాఖ్యలు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.

బాన్సువాడ నియోజకవర్గాభివృద్ధికి నిధులు ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేసీఆర్పై అభిమానం – తప్పనిసరి పరిస్థితులు: “కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ కొన్ని రాజకీయ పరిణామాల వల్ల తప్పలేదు. అన్నం పెట్టిన కేసీఆర్ను మరవడం నాకు కష్టంగా ఉంది. బాన్సువాడ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగింది.”

కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు: “నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను. ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తేనే పార్టీలో చేరాను.”

రేవంత్ మాట మంత్రులు వినడం లేదు:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మంత్రులు అస్సలు లెక్క చేయడం లేదు. నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని సీఎం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పినా వారు పట్టించుకోలేదు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.”

వేం నరేందర్రెడ్డిపైనా ఆగ్రహం: “మంత్రులు పట్టించుకోవడం లేదు కాబట్టి నువ్వైనా నిధులు విడుదల చేయాలని వేం నరేందర్ రెడ్డికి సీఎం చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు. వేం నరేందర్ రెడ్డికి ఏకంగా 50 సార్లు ఫోన్ చేసినా అటెండ్ చేయడం లేదు.”

“గత నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించినప్పుడు ఆయనను నేరుగా సూటిగా ప్రశ్నించాను. ‘నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యే పదవిని ఏమైనా కొన్నావా?’ అని నిలదీశాను.” పార్టీ మారినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం, నియోజకవర్గ అభివృద్ధి పనులు నిలిచిపోవడంపై పోచారం చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి.

Share
Share