Breaking News: మాదారం చెరువు ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మాదారం చెరువు ఆక్రమణల వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది. చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ స్థానికులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చెరువును కబ్జాదారుల చెర నుంచి కాపాడేందుకు సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదులో నల్గొండ జిల్లా ఆర్డీవో(RDO) వై. అశోక్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సొంత గ్రామమైన మాదారం పరిధిలోని చెరువు ఆక్రమణల విషయం దృష్టికి వచ్చినప్పటికీ ప్రారంభంలో పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిన తర్వాత జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ కావడంతో ఆర్డీవో చెరువును సందర్శించారని తెలిపారు. అయితే ఆ పరిశీలన కేవలం తూతూమంత్రంగా జరిగిందని, వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో నమోదు చేయలేదని ఆరోపించారు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోకుండా వ్యవహరించడంతో చెరువులోని మిగిలిన ఆక్రమణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రాంతాలను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగమే మౌనం వహిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భూ ఆక్రమణదారులతో కొంతమంది అధికారులు కుమ్మక్కై అక్రమ ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయని, వాటి నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ అవసరమని డిమాండ్ చేశారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కూడా మాదారం చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని సూచించినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల సూచనలను కూడా లెక్కచేయకపోవడం వెనుక కారణాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఫిర్యాదుదారులు పలు డిమాండ్లు చేశారు. ఆర్డీవో అశోక్ రెడ్డి విధి నిర్వహణపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని, గతంలో వచ్చిన ఫిర్యాదులు, పరిశీలనలు, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను తెప్పించాలని కోరారు. చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్ ప్రాంతాలను సర్వే చేసి హద్దులు నిర్ణయించి అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అధికారుల సహకారంపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని, అవినీతి లేదా అధికార దుర్వినియోగం రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదారం చెరువుతో పాటు నల్గొండ జిల్లాలో ఆక్రమణలకు గురైన ఇతర చెరువులపై కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు.

చెరువులు రైతుల జీవనాధారం, భూగర్భ జలాల నిల్వకు ప్రధాన ఆధారం, భవిష్యత్ తరాల ఆస్తి అని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కబ్జాదారుల చేతుల్లోకి ప్రభుత్వ చెరువులు జారిపోతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం ప్రజాస్వామ్య పాలనకు మచ్చ అని విమర్శించారు. మాదారం చెరువును పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తి చేసి ప్రజా ఆస్తులను రక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజల తరఫున కోరారు.

Share
Share